బీజేపీ శ్రేణుల అత్యుత్సాహం.. యోగి సభలో బుల్డోజర్లతో బ్రేక్ డ్యాన్స్

వేదిక వద్ద మ్యూజిక్ ప్లే చేస్తుండగా ఆపరేటర్లు బుల్డోజర్లను అటు ఇటు తిప్పుతూ విన్యాసాలు చేయించారు. అయితే ఈ సభకు వచ్చిన జనం కూడా నాయకుల ప్రసంగాలు వినడం మాని బుల్డోజర్ల విన్యాసాలు చూడటం మొదలుపెట్టారు.

Advertisement
Update: 2024-05-09 10:36 GMT

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభలో బీజేపీ శ్రేణులు బుల్డోజర్లతో బ్రేక్ డ్యాన్స్ చేయించడం వివాదాస్పదంగా మారింది. స్థానిక బీజేపీ శ్రేణుల చేష్ట‌ల‌పై పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి యోగి బుధవారం ఫరూఖాబాద్ లోక్ సభ స్థానం అలీ గంజ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ కళాశాల గ్రౌండ్‌లో సభ నిర్వహించారు.

అయితే సభాస్థలికి ముఖ్యమంత్రి యోగి రాకముందు వేదిక వద్ద స్థానిక నాయకులు బుల్డోజర్లతో బ్రేక్ డ్యాన్స్ వేయించే కార్యక్రమం నిర్వహించారు. డజన్ల కొద్దీ బుల్డోజర్లను వేదిక వద్దకు తెచ్చిన బీజేపీ నాయకులు వాటితో బ్రేక్ డ్యాన్స్ విన్యాసాలు చేయించారు.

వేదిక వద్ద మ్యూజిక్ ప్లే చేస్తుండగా ఆపరేటర్లు బుల్డోజర్లను అటు ఇటు తిప్పుతూ విన్యాసాలు చేయించారు. అయితే ఈ సభకు వచ్చిన జనం కూడా నాయకుల ప్రసంగాలు వినడం మాని బుల్డోజర్ల విన్యాసాలు చూడటం మొదలుపెట్టారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే సత్యపాల్ సింగ్ స్పందిస్తూ స్థానిక నాయకుల అత్యుత్సాహంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్లతో బ్రేక్ డ్యాన్స్ వెంటనే నిలిపివేయాలని సూచించారు.

జనం మధ్య అలా బుల్డోజర్లను తిప్పితే ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే పార్టీకే చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే స్థానిక నాయకులను మందలించారు. ఇదిలా ఉండగా ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సభాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఉన్న బుల్డోజర్లను చూసి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నేరస్తులు, దేశ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి మనం ఈ యంత్రాలను విభిన్నమైన పద్ధతిలో వాడుతున్నాం అంటూ.. ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ప్రజల రక్షణకు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. జనాల జేబులను దోచుకోవడానికి కాంగ్రెస్, సమాజ్ వాదీ జట్టు కట్టాయని విమర్శించారు.

కాగా, యూపీలో యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరస్తుల ఏరివేత మొదలైన సంగతి తెలిసిందే. పెద్దపెద్ద నేరాలు చేసే వారిని సీఎం యోగి ఎన్ కౌంటర్ చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే నేరాలకు పాల్పడే వారి ఇళ్ళను కూడా యోగి సర్కార్ బుల్డోజర్లతో ధ్వంసం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. యూపీలో యోగి ప్రభుత్వాన్ని కొందరు బుల్డోజర్ సర్కార్.. అని కూడా పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో యోగి హాజరైన ఓ సభలో బుల్డోజర్లతో బ్రేక్ డ్యాన్స్ చేయించడం సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News