ఎవరు విచారించాలో కూడా ‘మార్గదర్శే’ డిసైడ్ చేస్తుందా?

డీఆర్ఐ అధికారులను తమతో పాటు లోపలకు తీసుకెళ్ళటానికి సీఐడీ అధికారులు మార్గదర్శి సిబ్బందితో పెద్ద వాగ్వాదమే చేయాల్సి వ‌చ్చింది. సీఐడీ ఎంత చెప్పినా మార్గదర్శి సిబ్బంది డీఆర్ఐని లోపలకు అనుమతించలేదు.

Advertisement
Update: 2023-06-07 06:33 GMT

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే తమను ఎవరు విచారించాలో డిసైడ్ చేస్తున్నారా? తాజాగా మార్గదర్శి చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ వైఖరి అలాగే ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో దశాబ్దాలుగా రామోజీరావు వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. మార్గదర్శి వ్యాపారమే మోసమని ఎప్పటి నుండో ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలను ఈ మధ్యనే సీఐడీ దాదాపు ధృవీకరించింది. కోర్టు విచారణలో కూడా మార్గదర్శి మోసాలు డిసైడ్ అయిపోయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెబుతున్నారు. అందుకనే రామోజీ, శైలజపై ఏ1, ఏ2గా కేసులు నమోదు చేసి సీఐడీ విచారిస్తోంది.

ఇందులో భాగంగానే మంగళవారం ఎండీని సీఐడీ విచారించింది. అయితే విచారణకు ముందు వాళ్ళింటి ముందు రోడ్డుపైన పెద్ద డ్రామా జరిగింది. ఆ డ్రామా ఏమిటంటే విచారణకు వచ్చిన అధికారులందరినీ మార్గదర్శి ఉద్యోగులు ఎండీ ఇంట్లోకి వెళ్ళకుండా అడ్డుకున్నారు. కారణం ఏమిటంటే వారిలో డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు కూడా ఉండటమే. సీఐడీ అధికారులతో కలిసి డీఆర్ఐ అధికారులు లోపలకు వెళ్ళటానికి మార్గదర్శి సిబ్బంది అంగీకరించలేదు.

మార్గదర్శి కేసు విచారణతో డీఆర్ఐ అధికారులకు ఏం ప‌ని అంటూ నిలదీశారు. మార్గదర్శి చీటింగ్‌లో మనీల్యాండరింగ్ కోణం ఉంద‌ని సీఐడీ అనుమానిస్తోంది. డీఆర్ఐ అనేది బ్లాక్ మనీ, మనీల్యాండరింగ్‌తో పాటు ఇతర ఆర్థిక‌ నేరాలను దర్యాప్తు చేస్తుంది. తమతో పాటు డీఆర్ఐ అధికారులను లోపలకు తీసుకెళ్ళటానికి సీఐడీ అధికారులు మార్గదర్శి సిబ్బందితో పెద్ద వాగ్వాదమే చేయాల్సి వ‌చ్చింది. సీఐడీ ఎంతచెప్పినా మార్గదర్శి సిబ్బంది డీఆర్ఐని లోపలకు అనుమతించలేదు.

చాలాసేపు ఇలా వాదనలు జరిగిన తర్వాత ఏమనుకున్నారో ఏమో మార్గదర్శి సిబ్బంది డీఆర్ఐ అధికారులను కూడా లోపలకు అనుమతించారు. అంటే తమను ఎవరు విచారించాలో కూడా మార్గదర్శి యాజమాన్యమే డిసైడ్ చేసేలాగుంది. యాజమాన్యం ఆదేశాలు లేకపోతే సిబ్బంది అధికారులను అడ్డుకునే ధైర్యంచేయగలరా? తమను ఎవరు విచారించాలనే విషయాన్ని కూడా తామే డిసైడ్ చేస్తామన్నట్లుగా ఉంది రామోజీ, శైలజ వ్యవహారం.

Tags:    
Advertisement

Similar News