విజయవాడ వైసీపీలో ముసలం..

బాధితురాలు కూడా గతంలో వైసీపీ కార్యకర్తేనంటూ అవినాష్ వ్యతిరేక వర్గం రచ్చ చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రమీజాను పరామర్శించారు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు వైసీపీ నేతలు, కార్యకర్తలను కొట్టారని మండిపడ్డారాయన.

Advertisement
Update: 2023-01-11 05:20 GMT

విజయవాడ తూర్పు నియోజకవర్గానికి 2024లో వైసీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరు ఖరారయ్యాక రాజకీయం మరింత రంజుగా మారింది. ఆ ప్రకటన తర్వాత టీడీపీ స్పీడ్ పెంచింది, పనిలో పనిగా వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన సీనియర్లు కూడా రగిలిపోతున్నారు. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి. ఆయన విజయవాడ తూర్పు టికెట్ ఆశించారు, చివరకు అది అవినాష్ కి వెళ్లిపోవడంతో సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆయన, ఇప్పుడు మరోదారి చూసుకోడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.

గడప గడపలో గొడవ..

ఇటీవల విజయవాడ రాణిగారి తోటలో పార్టీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ గడప గడప కార్యక్రమం కోసం వెళ్లారు. స్థానిక కార్పొరేటర్ రామిరెడ్డిని రమీజా అనే మహిళ నిలదీసింది. తమకోసం ఏ పనీ చేయట్లేదని, అవినాష్ కి కంప్లయింట్ చేసింది. ఇంటిమీద టీడీపీ జెండా ఏంటమ్మా అని ప్రశ్నిస్తే, మీరు గుడివాడలో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు కట్టామన్నా అంటూ మరో మహిళ సమాధానం చెప్పింది. ఆ తతంగాన్నంతా వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కడితో గొడవ మొదలైంది. వైసీపీకి గడపగడపలో చుక్కెదురని టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేసింది. దీంతో వైసీపీ మహిళా కార్యకర్తలు, రమీజా ఇంటిపైకి వెళ్లారు. ఆ గొడవ తర్వాత యధావిధిగా పోలీసులు బాధితులపై కేసులు పెట్టి స్టేషన్లో పెట్టారు.

బాధితురాలు కూడా గతంలో వైసీపీ కార్యకర్తేనంటూ అవినాష్ వ్యతిరేక వర్గం రచ్చ చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రమీజాను పరామర్శించారు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు వైసీపీ నేతలు, కార్యకర్తలను కొట్టారని మండిపడ్డారాయన. కార్పొరేషన్‌ ఎన్నికల్లో రామిరెడ్డి తరఫున ప్రచారం చేసినవారిని ఇప్పుడు అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. సమస్యలు ఉంటే ప్రజలు ప్రశ్నిస్తారని, అంతమాత్రాన కారం ప్యాకెట్లు, రాళ్లతో వెళ్లి దాడి చేయడమేంటని అడిగారు. ఈ ఘటనపై చాలా మాట్లాడాలని ఉన్నా సొంతపార్టీ వాళ్లే ఇదంతా చేయడం వల్ల మాట్లాడలేకపోతున్నానన్నారు రవి. అధికారం ఉందని దాడులు చేయడం సరికాదని, ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

విజయవాడలో జరిగిన వ్యవహారం, కొట్లాట, పోలీస్ కేసుల తర్వాత అధిష్టానం ఈ వ్యవహారంపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. సొంత పార్టీ కార్యకర్తల్నే పోలీసులు అరెస్ట్ చేశారంటూ రవి వర్గం గొడవ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అభ్యర్థిని ప్రకటించినప్పుడే ఇలా ఉంటే, ఇక ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ పార్టీ వ్యవహారాలు ఎలా ఉంటాయోననే అనుమానాలు బలపడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News