రఘురామకృష్ణరాజుకు ఉండిలో మూడో స్థానమేనా?

పోలింగ్‌కు మరో రెండు వారాలు మాత్రమే గడువుండగా అసలు టీడీపీ కేడర్‌ ఎవరో కూడా ఆయనకు తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క శివరామరాజు వర్గం రఘురామపై నాన్‌ రెసిడెంట్‌ ఉండి (ఎన్‌ఆర్‌యూ) నినాదంతో ముందుకు వెళుతోంది.

Advertisement
Update: 2024-04-27 06:20 GMT

పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ ఆల్రెడీ ప్రకటించిన సీటును చంద్రబాబుపై ఒత్తిడి చేసి మరీ.. లాక్కున్న రఘురామకృష్ణరాజును అక్కడి తాజా పరిస్థితి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ నియోజకవర్గంలో అధికార పక్షం జోరు మీద ఉండగా, టీడీపీ మాత్రం మూడు ముక్కలైన పరిస్థితి నెలకొంది. తనకు దక్కిన సీటును అధిష్టానం ఒత్తిడితో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు రఘురామకు వదిలేసినప్పటికీ.. ఆయన అభిమానులు, టీడీపీ కేడర్‌ మాత్రం రఘురామకృష్ణరాజుపై కారాలు మిరియాలు నూరుతున్నారు.

మరోపక్క ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వేటుకూరి శివరామరాజు తనకు సీటు ఇవ్వకుండా అవమానించిన టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఎవరి మాటా వినకుండా నామినేషన్‌ వేసి బరిలోకి దిగిపోయారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. ఆయన ఇండిపెండెంట్‌గా కాకుండా ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి బీఫాం తెచ్చుకుని పోటీ చేయడం. దీనికి ప్రధాన కారణం ఈవీఎంలో తొలి ఐదు గుర్తుల్లో ఈ పార్టీ ఎన్నికల గుర్తు ఉండే అవకాశం ఉండటం. అంతేకాదు. ఆ పార్టీ సింబల్‌ సింహం కావడం. జనంలోకి ఈ గుర్తును ఈజీకి తీసుకెళ్లొచ్చనేది ఆయన వ్యూహం. దీంతో ఒకపక్క అధికారపక్షం జోరు, మరోపక్క టీడీపీ రెబల్‌ పోరు, సొంతగూటిలో పైకి కనిపించని అసమ్మతి సెగలు రఘురామకృష్ణరాజును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

పోలింగ్‌కు మరో రెండు వారాలు మాత్రమే గడువుండగా అసలు టీడీపీ కేడర్‌ ఎవరో కూడా ఆయనకు తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క శివరామరాజు వర్గం రఘురామపై నాన్‌ రెసిడెంట్‌ ఉండి (ఎన్‌ఆర్‌యూ) నినాదంతో ముందుకు వెళుతోంది. ఒకవేళ రఘురామ గెలిస్తే.. నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండడని, రేపు ప్రజలు, పార్టీ నాయకులు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఎక్కడికి వెళ్లాలి, ఎవరిని కలవాలనే ప్రశ్నలను సంధిస్తోంది.

ఇక నామినేషన్‌ సందర్భంగానూ, ఎన్నికల ప్రచారంలోనూ రఘురామకు ప్రజల నుంచి స్పందన కనిపించపోవడం ఆయన శిబిరాన్ని నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో రఘురామ మూడో స్థానంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆ నెపాన్ని ఎమ్మెల్యే రామరాజు, ఆయన వర్గంపై వేసేసి చేతులు దులిపేసుకుని వెళ్లిపోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టు టీడీపీ కేడర్‌ అనుకుంటున్నారు. లోపల ఓటమి భయం వేధిస్తున్నా.. పైకి రఘురామ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.

Advertisement

Similar News