ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టం.. స్థిరాస్తుల వివాదానికి శాశ్వ‌త‌ పరిష్కారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క సర్వే జియో టాగింగ్ లాంటివి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఒక చట్టాన్ని తయారు చేశారు. ఇక అది టెస్టింగ్ చేయాలని అనుకుంటున్నారు. అంతేకానీ ఇంకా దాన్ని మన రాష్ట్రంలో అమలు పరచలేదు.

Advertisement
Update: 2024-05-08 05:50 GMT

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల భూములను కాజేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. ఆయన ఆరోపణలు, ఆయన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని నిపుణులు చెప్పుతున్నారు. ఆ చట్టంపై అపోహలు తొలగాలంటే డాక్టర్ కె. చంద్రమౌళి అభిప్రాయాన్ని చదవాల్సిందే.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించి భయాందోళనకు గురిచేస్తున్నారు. కొత్త చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతాయని.. తమకు తెలియకుండానే వేరే వ్యక్తులు తమ భూములను కాజేసే అవకాశం ఉంటుందని లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు.

భూ వివాదాల కోసం సివిల్స్ కోర్టులను ఆశ్రయించకుండా చేయడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారుతుందని, ట్రైబ్యునళ్లను ఆశ్రయించాల్సి రావడంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారని, స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లిన ప్రజలు.. ఇప్పుడు పరిష్కారంకోసం తిరిగి అధికారుల దగ్గరకే వెళ్లాల్సి వస్తోందని తప్పుడు, అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాలనుకున్న ఈ చట్టం మన దేశంలో విప్లవాత్మకమైన చట్టం.. ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది. ఇది మన భారతీయుల ఎన్నో ఏళ్ల కల. ఇది కబ్జాదారులకు పెట్టుబడిదారులకు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్లకు కంటగింపుగా ఉంటుంది.

ఇది ఈరోజు మొదలుపెట్టినది కాదు..

1989, 2004 (NLRMP- National land records modernization program) తరువాత DILRMP డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడరర్నైజేషన్ ప్రోగ్రాంనుంచి డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా అనే విధానం ద్వారా దీనిలో మార్పులు చేర్పులు జరుగుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వచ్చింది.

ఒకప్పుడు మనకు మునసబు -కరణాల రెవెన్యూ వ్యవస్థ ఉండేది.. ఏవైనా భూతగాదాలు సరిహద్దు తగాదాలు వస్తే మునసబు -కరణాలు వచ్చి రికార్డులు పరిశీలన చేసి మనకు కొలతలు వేసి పరిష్కరించేవారు.. తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేసి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని వేరే ఊరి నుంచి ఉద్యోగం కోసం వచ్చే వాళ్ళను వేయడం వలన వారికి పూర్తిగా అవగాహన లేక రెవెన్యూ రికార్డులు తారుమారై చాలా సమస్యలు వచ్చాయి. తర్వాత అక్రమార్కులు యదేశ్ఛ‌గా చెరువులను కుంటలను, పోరంబోకు భూములను, సరిహద్దు భూములను, ఎండోమెంట్ లాండ్స్ ను కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిపోయింది.

ల్యాండ్‌ రిజిస్ట్రేషన్ ప్రస్తుత విధానం:

పాత తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, సినిమాలో "చార్మినార్ అమ్ముతారట కొంటావా" అని అంటాడు.. అది తమాషాకే అయినా కానీ మన రిజిస్ట్రేషన్ విధానంలో ఉన్న లొసుగులను అది వెటకారంగా తెలుపుతుంది.

మనం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్తే మన ఆధార్ కార్డు మన ఫోటో తీసుకొని అమ్మే వాళ్లకు కొనేవాళ్లకు అబ్జెక్షన్ లేదా అని గమనించి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. మనం దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేస్తున్నాము కానీ వాళ్ళు దానికి ఎటువంటి బాధ్యత వహించరు. ఒక్కొక్కసారి ఆస్తిపత్రాలు మన దగ్గర ఉన్నా కానీ అవి దొంగగా సృష్టించబడి డబుల్ రిజిస్ట్రేషన్లు, లేకపోతే మనకు తెలియకుండానే మన భూమి వేరే వాళ్ల పైన రిజిస్టర్ కావడం చూస్తూ ఉంటాం.

మనం మహా అయితే ఎంకంబరెన్స్ సర్టిఫికెట్ తీసుకుంటామో లేదా లింక్ డాక్యుమెంట్ చూస్తాము కానీ మనం తీరా కొన్న తర్వాత ఎవరైనా అది వక్ఫు భూములనో, ఎండోమెంట్ ల్యాండ్ లనో లేక పట్టా స్థలాలనో తెలిపితే మనం కష్టార్జితాన్ని పెట్టి కొన్న ఆ భూమిని లేక ఇంటి స్థలాన్ని ఏం చేయాలో అర్థం కాక కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాం.

మనకు అప్పుడు దిమ్మతిరిగి ఎవరినైనా అడిగితే అప్పుడు చావు కబురు చల్లగా చెబుతారు. ‘బాబూ ...రిజిస్ట్రేషన్ చేసేంత వరకే మా బాధ్యత అదంతా పరిశీలన చేసుకుని దాని పూర్వపరాలను తెలుసుకొని కొనుక్కోవలసిన బాధ్యత నీదే, మాకేం సంబంధం లేదు’ అనడం మనం చాలా సార్లు గమనించి ఉంటాం.

మనం ఇంత స్టాంప్ డ్యూటీ కట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మరి ప్రభుత్వం ఆఫీసు మాకేం బాధ్యత లేదు అంటే ఎలా అని మనకు చాలా సార్లు కోపం వచ్చి ఉంటుంది. కానీ ఏం చేయలేం చట్టం అలా ఉంది.

కొత్త చట్టం ఏం చెప్పుతుందంటే..

సరిగ్గా ఇక్కడే మనకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెట్టాలనుకున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనేది మనకు ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రభుత్వం మన స్ధలంపైన ఉన్న అన్ని రకాల డాక్యుమెంట్లను ఒకే చోటికి తెస్తుంది. సమగ్ర చరిత్ర అంతా ఒకే చోట ఉంటుంది.

దీనికోసం ముందుగా మన స్థలాలను పొలాలను జియో విధానం ద్వారా సర్వే చేసి దానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను కేటాయిస్తారు. తర్వాత దాన్ని కంప్యూటరయిజేషన్ చేసి దానికి ఉన్న ఎంకంబరెన్స్ సర్టిఫికెట్, లింక్ డాక్యుమెంట్లు, మిగతా డిపార్ట్మెంట్స్ అనగా రెవెన్యూ, ఎండోమెంట్స్ ఇలా ఎన్నో శాఖల దగ్గర ఉన్న సమాచారం అంతా ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ఫైల్ లోకి వెళ్లిపోతుంది. ఏవైనా కోర్టు కేసులు ఉన్నా డబుల్ రిజిస్ట్రేషన్ లో ఉన్నా కానీ మనకు అందులో తెలిసిపోతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆ భూమి లేదా స్థలానికి సంబంధించిన సమగ్రమైన చరిత్ర అంతా ఆ డాక్యుమెంటులో, కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటుంది.ఏ రికార్డులో ఎక్కడైనా మార్పు జరిగితే అది ఇక్కడ మార్పు జరిగిపోతుంది. దీన్ని మిర్రర్ ప్రిన్సిపల్ అని అంటారు. ఇది ప్రభుత్వ ధ్యేయం.

ఇంతకుముందు మాదిరి రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపు కోకుండా.. ఈ కొత్త చట్టంలో మనకు ఆ టైటిల్ కు కావలసిన చట్టపరమైన రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా దీనికి ఏమైనా సమస్యలు వస్తే మన కష్టార్జితం పోకుండా ఇన్సూరెన్స్ కూడా చేసి ఉంటుంది.

మన రాష్ట్రంలో..

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క సర్వే జియో టాగింగ్ లాంటివి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఒక చట్టాన్ని తయారు చేశారు. ఇక అది టెస్టింగ్ చేయాలని అనుకుంటున్నారు. అంతేకానీ ఇంకా దాన్ని మన రాష్ట్రంలో అమలు పరచలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో భూములకు సంబంధించి 30కిపైగా రికార్డులున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి.. ఇలా అన్ని రకాల భూములకు సంబంధించి ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుందని భూమి యజమానులకు భరోసా వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించొచ్చని చెబుతోంది.

అంతేకాకుండా ఈ చట్టం పూర్తిగా దేశమంతా అమలు అయిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ పట్టణంలో కూర్చొని అయినా కానీ మన ఇంట్లో నుంచే దేశంలో ఉండే ఎక్కడ ఉన్న స్థలం కొనాలన్నా కంప్యూటర్లో వెరిఫై చేసుకోవచ్చు.

అంతేకాకుండా మన దేశంలో ఉండే 16 భాషలలోకి అవి తర్జుమా అయ్యి మనకు కనిపిస్తాయి. కావున మనం ఏ లాంగ్వేజ్ లో అది ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన గాని మన లాంగ్వేజ్ లో మనం చదువుకోవచ్చు. మనం ఆ డాక్యుమెంట్ అంతా పరిశీలన చేసి సంతృప్తి చెందిన తర్వాత మనం ఇంకా కావాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని మనం స్థలం కానీ పొలం గాని కొనొచ్చు.

ఇది మనకు పనికొచ్చే చట్టమే కానీ మన భూములను మన ఇళ్ల స్థలాలను ఎవరో దొంగలించడం లేక తాకట్టు పెట్టుకోడానికి పనికి రాదు.బాండ్ పేపర్లు మన దగ్గర ఉన్నా కానీ మన స్థలాలు డబుల్ రిజిస్ట్రేషన్లు చేసే ఈ కాలంలో ప్రభుత్వమే ముందుకు వచ్చి మన స్థలాలకు గ్యారెంటీ ఇచ్చి, ఇన్సూరెన్స్ కూడా చేసి మనకు ఒక ధైర్యాన్ని కల్పించే ఈ చట్టాన్ని అడ్డుకోవడం అనేది మన మూర్ఖత్వమే.

భారతదేశమంతా ఈ చట్టం అమలై మనకందరికీ మంచి జరిగడానికి ఇంకా దాదాపుగా 10-15 ఏళ్లు పడుతుంది. ప్రస్తుత కుహనా రాజకీయ సంస్కృతిలో ఇంకా ఎన్నాళ్లు పడుతుందో మనం ఎదురు చూడాలి.

Tags:    
Advertisement

Similar News