దళితులపై దాడులు వాళ్లకు మామూలే..

అంట‌రానిత‌నం ఆ స్థాయిలో ఉండేది ఆ కాలంలో.. జాత్యహంకారం, అగ్రకుల ఆధిపత్య ధోరణి పెచ్చుమీరిపోయి, ఒక దళితుడు తమని ప్రశ్నించడమేంటని ఆగ్రహించి వారిపై దాడికి తెగబడ్డారు.

Advertisement
Update: 2024-05-08 07:56 GMT

మంగళవారం అర్ధ‌రాత్రి గోపాల‌పురంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. ఏకంగా రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై దాడికి య‌త్నించారు. గోపాల‌పురంలో న‌ల్ల‌జ‌ర్ల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగించుకొని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు వ‌నిత‌. ఆ స‌మ‌యంలో వంద మంది టీడీపీ గూండాలు మూకుమ్మ‌డిగా ఆ ఇంటిపై దాడి చేశారు. అక్కడున్న వైసీపీ శ్రేణుల‌ను విచక్షణా రహితంగా కొట్టి, ఇంట్లోని సామగ్రిని, ఫ‌ర్నిచ‌ర్‌ను, ప్ర‌చార ర‌థాన్ని ధ్వంసం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది రక్షణగా ఉండటంతో హోం మంత్రి దాడి నుంచి తప్పించుకున్నారు. కానీ, కొందరు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

తెలుగుదేశం మొదటి నుంచీ దళితులకు వ్యతిరేకమే. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఈ విశృంఖల పోకడలు బయటపడ్డాయి. ఎన్నికలు జరిగిన రోజునే, 1983 జనవరి 5న చిత్తూరు జిల్లాలోని పదిరికుప్పం గ్రామంలోని దళితవాడ మీద గూండాలు చెలరేగిపోయియారు. ఓటు హ‌క్కు వినియోగించుకున్నందుకు వారి ఇళ్లపై దాడిచేశారు. సుమారు 40 దళిత నివాసాలు (పూరి గుడిసెలు) తగలబెట్టారు. ఈ దారుణ‌కాండ‌లో నలుగురు చనిపోయారు. ఒక దళిత మహిళ తింగమ్మ శవాన్ని గుర్తించారు. మిగిలిన వారిని కనీసం గుర్తించలేదు కానీ, దహన కార్యక్రమం పూర్తిచేశారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఓటర్లయిన దళితులపై తెలుగుదేశం గూండాలు పాశవికంగా దాడి చేసి నలుగురిని పొట్టనబెట్టుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తెలుగుదేశం దాన్ని ఖండించి, తమ కార్యకర్తలు, దాడికి పాల్పడిన వారిని రక్షించడానికి ప్రయత్నించారన్న క‌ప్పిపుచ్చుకునే వాదనకి పెద్దగా పస లేకుండా పోయింది.

ఇక ప్రపంచమంతా మారుమోగింది మరో ఘోరమైన సంఘటన కారంచేడు. ప్రకాశం జిల్లా కారంచేడులో మాదిగ వర్గానికి చెందిన ఆరుగురు దళిత యువకులను స్థానికంగా ఉన్న బలమైన వర్గం బలితీసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌ 1985 జూలై 17న జరిగింది. దేశమంతా అట్టుడికిపోయింది. తెలుగుదేశం అధినేత, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ప్రభుత్వం ఈ ఘటన లో తీవ్రమైన ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంది.

మంచినీళ్ల చెరువును అగ్రకులానికి చెందిన యువకుడు మలినం చేస్తుంటే ఒక దళిత యువకుడు అభ్యంతరం చెప్పాడు. ఈ చెరువును దళితులు తాగునీటి అవసరాలకు వాడే వారు. అగ్రకులానికి చెందిన యువకుడు గేదెలని ఈ చెరువులో కడుగుతుండటంతో దళిత యువకుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ ప్రారంభమైంది.

అంట‌రానిత‌నం ఆ స్థాయిలో ఉండేది ఆ కాలంలో.. జాత్యహంకారం, అగ్రకుల ఆధిపత్య ధోరణి పెచ్చుమీరిపోయి, ఒక దళితుడు తమని ప్రశ్నించడమేంటని ఆగ్రహించి వారిపై దాడికి తెగబడ్డారు. దాదాపు 23 సంవత్సరాలపాటు వివిధ న్యాయస్థానాల్లో వ్యాజ్యం నడిచి, చివరిలో సుప్రీం కోర్టు తీర్పుతో ఒక కొలిక్కి వచ్చింది. ఒకరికి యావజ్జీవ కారాగార శిక్ష, 30 మందికి మూడేళ్ళ జైలు శిక్ష‌ విధించింది కోర్టు. అందరూ అగ్రకులానికి చెందిన వాళ్ళే. నిందితుల్లో కొందరు అప్పటికే చనిపోయారు కూడా.

ఈ సంఘటనలో దగ్గుబాటి చెంచురామయ్య కూడా ప్రధాన నిందితుడు. ఈయన ఎన్‌టీ రామారావుకి వియ్యంకుడు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు తండ్రి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరికి మామ. ఈయనని కొన్నాళ్ల తర్వాత దళిత యువకులు ఇంటి ముందే నరికి చంపేశారు.

ఇక 1987 జూలై 17న గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండల నీరుకొండ గ్రామంలో అగ్రకులానికి చెందిన ప్రాంతంలో వివాహ వేడుకలు జరిపిస్తున్నారన్న నెపంతో ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తిని, నలుగురు మాల యువకులనూ ఊచకోత కోశారు. అనేకమంది దళిత యువకులు మంగళగిరి పారిపోయి తమని తాము రక్షించుకున్నారు. ఈ నరమేధం కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే.. ఎన్‌టీ రామారావు నేతృత్వంలో నడుస్తున్న కాలంలోనే.

ఇక చంద్రబాబు హయాంలోని ఘటనలు కోకొల్లలు..

2018లో జనవరి ఒకటో తారీఖున గుంటూరు జిల్లాలోని పెదగొట్టిపాడులో ఒక దళిత యువకుడి హత్య జరిగింది. నిజానికి తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై ఎన్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పడ్డాయో లెక్కతీస్తే నిజాలు నిగ్గు తేల్చినట్టవుతుంది. ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎంత మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, మంత్రులుగా పనిచేసినవాళ్లు, వివిధ స్థాయి నాయకులూ ద‌ళితుల‌పై దాడులు, దూషణలకు పాల్పడ్డారో లెక్కతీసి బయటపెట్టాల్సిన అవసరం ప్రత్యర్థులపై కూడా ఉంది.

సాక్షాత్తు హోంమంత్రి మీద దాడి చేశారంటే.. ఇక వీరు రేపు అధికారంలోకి వస్తే టీడీపీ గూండాల‌ ఆగడాలకు హ‌ద్దే ఉండదు. నలభై రెండేళ్ల చరిత్ర చెబుతున్న వాస్తవం ఇదే.

Tags:    
Advertisement

Similar News