చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాను: ఏపీ సీఎం వైఎస్ జగన్

ప్రతిపక్షాలకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని.. తాను చెడిపోయిన వ్యవస్థతో యుద్దం చేస్తున్నానంటూ సీఎం జగన్ భావోద్వేగంగా మాట్లాడారు.

Advertisement
Update: 2022-12-24 11:48 GMT

'పులివెందులలో బస్టాండ్ కూడా కట్టని సీఎం.. ఏపీకి మూడు రాజధానులు కడతాడంటా!' నిన్న మొన్నటి వరకు వైఎస్ జగన్ టార్గెట్‌గా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ విమర్శలు సీఎం జగన్‌ మనసులోనే పెట్టుకున్నట్లు ఉన్నారు. శనివారం పులివెందుల కొత్త బస్టాండ్ ప్రారంభించిన తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని.. తాను చెడిపోయిన వ్యవస్థతో యుద్దం చేస్తున్నానంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

పులివెందుల నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకు ముందు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ వద్ద సీఎం నివాళి అర్పించారు. ఆ తర్వాత పులివెందులలో కొత్తగా నిర్మించిన కూరగాయల మార్కెట్, బస్టాండ్‌, కదిరి రోడ్డు జంక్షన్ విస్తరణను ప్రారంభించారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ రోజు మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబుతోనో, టీడీపీతోనే కాదు.. చెడిపోయిన ఉన్న వ్యవస్థతో అన్నారు. ఆ వ్యవస్థ మరేంటో కాదు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లకు తోడు ఓ దత్త పుత్రుడు అని దుయ్యబట్టారు.


గతంతో పోలిస్తే అప్పుల పెరుగుదల తక్కువగానే ఉందని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో కూడా ఇదే బడ్జెట్ ఉందని.. అయినా ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అవినీతికి తావులేకుండా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో విద్యార్థులు, రైతులు, పేదల తలరాతలు మారుతున్నాయని అన్నారు. వైసీపీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. లంచాలకు తావు లేకుండా అందరికీ పథకాలు అందుతున్నాయని చెప్పారు.

మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని ఆయన చెప్పారు. పులివెందులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాము. ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని అనడంలో ప్రతిపక్షాలవి రాజకీయాలే తప్ప నిజాలు కావని జగన్ అన్నారు. అత్యధునిక వసతులతో కూడిన వైఎస్ఆర్ బస్టాండ్‌ను ప్రారంభించామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్ టెర్మినల్స్‌కు పులివెందుల బస్టాండ్ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం జగన్ చెప్పారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్.. క్రిస్మస్ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ చర్చిలో ప్రార్థనలు చేశారు. రేపు పులివెందుల చర్చిలో క్రిస్మస్ జరుపుకుంటారని తెలుస్తున్నది. 




Tags:    
Advertisement

Similar News