పిఠాపురంలో చంద్రబాబుకు షాక్ తప్పదా?

వర్మకు ప్రత్యామ్నాయంగా టీడీపీలో మరో గట్టి నేత లేరు. వర్మ జనసేనలో చేరటం ఖాయమైతే మరో గట్టి నేతను వెతుక్కోవటం చంద్రబాబుకు కష్టమే.

Advertisement
Update: 2022-11-24 05:34 GMT

కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు షాక్ తప్పేట్లులేదు. కారణం ఏమిటంటే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి వెళ్ళి వర్మ సమావేశమయ్యారట. తనకు పిఠాపురంలో టికెట్ ఖాయం చేస్తే తాను జనసేనలో చేరుతానని చెప్పినట్లు నియోజకవర్గంలో ప్రచారం పెరిగిపోతోంది.

వర్మకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఓడిపోయిన వర్మ 2014 ఎన్నికల్లో భారీ మెజారిటితో ఇండిపెండెంటుగా గెలిచారు. ఆ తర్వాత వర్మను చంద్రబాబు మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి దొరబాబు చేతిలో వర్మ ఓడిపోయారు. మొత్తం మీద టీడీపీలో వర్మ గట్టి నేతనే చెప్పాలి. అలాంటి నేత పవన్‌ను కలవటం, జనసేనలో చేరుతానని చెప్పటం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది.

ఇంతకీ వర్మ జనసేనలో ఎందుకు చేరాలని అనుకుంటున్నట్లు? ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుండి జనసేన గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు సుమారు 90 వేలు ఉన్నయాట. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని ఇక్కడి నుండి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే తాజా పరిణామాల్లో పొత్తులపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. పొత్తున్నా లేకపోయినా జనసేన గెలుపు ఖాయమనే ప్రచారం వల్ల వర్మ పార్టీ మారుదామని అనుకున్నారట.

అంతిమంగా ఫలితం ఎలాగుంటుందో ఇప్పుడే చెప్పటం కష్టమే అయినా వర్మ గనుక జనసేనలో చేరితో టీడీపీకి బాగా ఇబ్బందైపోతుంది. ఎందుకంటే గడచిన మూడు ఎన్నికల్లో టీడీపీ తరపున వర్మే పోటీ చేస్తున్నారు. 2014లో ఇండిపెండెంటుగా పోటీ చేసినా టీడీపీ నేతలు మొత్తం వర్మకే సపోర్టు చేశారు. వర్మకు ప్రత్యామ్నాయంగా టీడీపీలో మరో గట్టి నేత లేరు. వర్మ జనసేనలో చేరటం ఖాయమైతే మరో గట్టి నేతను వెతుక్కోవటం చంద్రబాబుకు కష్టమే. గెలుపోటములు ఎవరిదనే విషయం ఇప్పుడే చెప్పలేకపోయినా టీడీపీకి మూడో స్ధానం తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News