పవన్ మరీ అంతలా భయపడ్డారా..? పిఠాపురంలో మరో హీరో

నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఆల్రడీ ప్రచారం మొదలు పెట్టారు. పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో ల్యాండ్ అయ్యారు. వీరికితోడు జబర్దస్త్ టీమ్ కూడా హడావిడి చేస్తోంది.

Advertisement
Update: 2024-05-02 05:13 GMT

పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి..? తన నియోజకవర్గంలో ప్రచారం చేసినా, చేయకపోయినా.. పార్టీ తరపున నిలబెట్టిన అభ్యర్థుల నియోజకవర్గాల్లో మాత్రం కచ్చితంగా ప్రచారం చేయాలి, వారి గెలుపుకోసం కష్టపడాలి. కానీ పవన్ కల్యాణ్ లో మాత్రం అలాంటి నాయకత్వ లక్షణాలు లేవు. తనతో కలిపి 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల్ని బరిలో దింపిన పవన్.. వారి తరపున ప్రచారం చేయడం కంటే పిఠాపురంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పిఠాపురం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో తాను గెలిచి అసెంబ్లీకి వెళ్తే చాలు అని ఫిక్స్ అయ్యారు.

పిఠాపురంలో మెగా టీమ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ప్రచారం సరిపోదనుకున్నారో ఏమో.. నాగబాబు కూడా అక్కడ చెమటోడుస్తున్నారు. నాగబాబు సతీమణి కూడా మరిది కోసం పిఠాపురంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. అది చాలదన్నట్టు మెగా ఫ్యామిలీ హీరోలను ఒక్కొక్కరినే రంగంలోకి దింపుతున్నారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఆల్రడీ పిఠాపురంలో ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు మరో హీరో ఆయనకు జత కలిశారు. పవన్ కల్యాణ్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో ల్యాండ్ అయ్యారు. ఆయన కూడా ప్రచారాన్ని హోరెత్తించారు. వీరికితోడు జబర్దస్త్ టీమ్ కూడా పిఠాపురంలో హడావిడి చేస్తోంది.

చిరంజీవి ఎప్పుడు..?

పిఠాపురంలో తమ్ముడి తరపున చిరంజీవి ప్రచారానికి వస్తారని అంటున్నా.. అది ఎప్పటినుంచి అనేది మాత్రం క్లారిటీ లేదు. అసలు చిరంజీవి వస్తారా లేదా అనేది ఇంకా ఫైనల్ కాలేదు. మెగాస్టార్ రావాలని జనసైనికులు బలంగా కోరుకుంటున్నారు. ఆయన వస్తేనే కాపు ఓట్లలో కాస్తయినా కదలిక వస్తుందని అనుకుంటున్నారు.

ఆఖరికి ఇలా కూడానా..?

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అస్సలు పడదు. గతంలో 'చెప్పను బ్రదర్' అనే డైలాగ్ తో పవన్ ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఆటాడేసుకున్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత వారిద్దరూ పెద్దగా కలసిన దాఖలాలు కూడా లేవు. అసలు మెగా ఫ్యాన్స్ కి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి సంబంధం లేదన్నట్టుగానే పరిస్థితులు మారిపోయాయి. అయితే తాజాగా పుష్ప-2 సాంగ్ రిలీజ్ అయింది. అందులో అల్లు అర్జున్ టీ గ్లాస్ పట్టుకునే సీన్ ఒకటి ఉంటుంది. ఆ 10 సెకన్ల క్లిప్ ని జనసైనికులు తెగ వైరల్ చేస్తున్నారు. తమకోసమే అల్లు అర్జున్ ఆ సీన్ చేశారని అంటున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇలా దిగజారిపోయారేంటనే కామెంట్లు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News