ఏపీ మంత్రి కొత్త వ్యూహం.. లోకల్ మేనిఫెస్టో

ప్రజల చేత, ప్రజల కోసం లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేస్తానని అంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Advertisement
Update: 2024-05-02 11:30 GMT

స్థానిక నియోజకవర్గాలకు ఆయా ప్రాంతాలనుబట్టి లోకల్ మేనిఫెస్టోలు అనేవి గతంలో చూసిన ప్రయోగాలే. అయితే వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఓ మేనిఫెస్టో విడుదల చేసింది. సీఎం జగన్ మేనిఫెస్టో హామీలను ప్రకటించారు. ఈ సమయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ లోకల్ మేనిఫెస్టో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేలాదిమంది ప్రజల అభిప్రాయాలు సేకరించి ఈ మేనిఫెస్టో తయారు చేస్తానంటున్నారాయన. గతంలో అనకాపల్లి నుంచి గెలిచిన మంత్రి అమర్నాథ్, ఇప్పుడు గాజువాక వచ్చారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి లోకల్ మేనిఫెస్టోని ఆయన సిద్ధం చేయిస్తున్నారు.

ప్రజల చేత, ప్రజల కోసం లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేస్తానని అంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజల భాగస్వామ్యంతో గాజువాక అవసరాలను గుర్తించి లోకల్ మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఒక హామీపత్రం లాగా దాన్ని రెడీ చేసి, ఈ ఎన్నికల ప్రచారంలో ఆ హామీ పత్రాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్‌ చేస్తున్నారు. వైసీపీ నేతలు స్థానికంగా తాము చేపట్టబోయే కొత్త కార్యక్రమాలతో ఇలాంటి లిస్ట్ రెడీ చేసి పాంప్లేట్ల రూపంలో ప్రచారం చేస్తున్నారు. అయితే గుడివాడ అమర్నాథ్ మాత్రం హామీ పత్రం రూపంలో వాటిని ఒకచోట చేర్చి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం గాజువాక. ఈ వైసీపీ సిట్టింగ్ స్థానం నుంచి ఈసారి మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తమ విధానం స్పష్టంగా చెప్పామని అంటున్న ఆయన.. ప్లాంట్ ప్రైవేటీకరణపై అసలు బీజేపీ విధానం ఏంటో చెప్పాలని నిలదీశారు. వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ పై కూటమి నేతలు ప్రస్తుతం చెబుతున్న నోటి మాటలను నమ్మడానికి జనం సిద్ధంగా లేరని, దీనిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేయాలంటున్నారు అమర్నాథ్.

Tags:    
Advertisement

Similar News