వరుసగా సీఎం పర్యటనల రద్దు.. కారణం ఏంటి..?

ముఖ్యమంత్రి పర్యటనలు రెండు రోజులపాటు వరుసగా రద్దవడానికి కారణం.. వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరవుతుండట‌మేనని ప్రతిపక్ష మీడియా ప్రచారం చేస్తోంది.

Advertisement
Update: 2023-01-28 03:58 GMT

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు వరుసగా రెండు రోజులపాటు రద్దు కావ‌డం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పొన్నూరులో పర్యటించాల్సి ఉంది. అదే రోజు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. పొన్నూరు పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పొన్నూరు పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటనకు సంబంధించి తెలంగాణ పోలీసులకు ఏపీ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే ఆఖరి నిమిషంలో పొన్నూరు, హైదరాబాద్ రెండు పర్యటనలు రద్దు అయ్యాయి.

ఇక, శనివారం జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదా పీఠానికి వెళ్లాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడిని, కోడల్ని ఆశీర్వదించాల్సి ఉంది. అయితే శుక్రవారం రాత్రి విశాఖ పర్యటన కూడా రద్దు అయినట్టు అధికారికంగా ప్రకటించారు.

సమీక్ష సమావేశాల కారణంగానే ఈ పర్యటనలు రద్దయ్యాయని అధికారులు చెబుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం కోసమే పొన్నూరు, హైదరాబాద్ పర్యటన రద్దయిందని అధికారులు చెబుతున్నా అవి అంత నమ్మశక్యంగా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం నుంచి గాని, వైసీపీ నుంచి గాని ఈ అరకొర స్పందన కారణంగా ప్రతిపక్షం వేరే ప్రచారాలు చేసేందుకు అవకాశం ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి పర్యటనలు రెండు రోజులపాటు వరుసగా రద్దవడానికి కారణం.. వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరవుతుండట‌మేనని ప్రతిపక్ష మీడియా ప్రచారం చేస్తోంది. సీబీఐ నోటీసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని.. నరేంద్ర మోడీ, అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారంటూ మీడియా ప్రచారం చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News