అమరావతిలో ఉద్రిక్తత.. నల్లబెలూన్లు, జెండాలతో రైతుల నిరసన

పేదలకు పట్టాల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Update: 2023-05-26 04:47 GMT

అమరావతిలో ఉద్రిక్తత.. నల్లబెలూన్లు, జెండాలతో రైతుల నిరసన

ఏపీ ప్రభుత్వం పేదలకు సీఆర్డీయే ప్రాంతంలోని ఆర్-5 జోన్‌లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుంది. గుంటూరు జిల్లా తూళ్లురు మండలం వెంకటాయపాలెంలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పేరుతో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పట్టాలు పంపిణీ చేస్తారు. 50,793 మంది లబ్దిదారులకు పట్టాలు, 5,024 మందికి టిడ్కో ఇళ్ల పట్టాలు అందజేస్తారు.


గుంటూరు, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలకు చెందిన వారికే ఇక్కడ ఏర్పాటు చేసిన 25 లే అవుట్లలో స్థలాలు కేటాయించారు. కాగా, రాజధాని పరిధిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంపై కొన్ని గ్రామాల రైతులు, మహిళలు అందోళన చేస్తున్నారు.

పేదలకు పట్టాల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం గ్రామాల్లో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వెలగపూడిలోని దీక్షా శిబిరం వద్ద రైతులు నల్ల బెలూన్లు, జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. అమరావతిని విచ్ఛిన్నం చేసే సీఎం గో బ్యాక్.. రాజధాని ద్రోహులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అమరావతిని నిర్మించి.. ఏపీని కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

మందడం గ్రామంలోని దీక్షా శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీఎం పర్యటనకు ఏపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతంలో 3 వేల మంది పోలీసులతో గట్టి భద్రత కల్పించారు. అమరావతి రైతులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటికే ఆందోళన చేస్తారనే అనుమానం ఉన్న పలువురిని గృహ నిర్బంధం చేశారు.  

Tags:    
Advertisement

Similar News