ఆపరేషన్ ‘కాపు’ స్టార్టయ్యిందా?

బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాపు సామాజికవర్గంలోని ప్రముఖులు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఇంకా చాలా మంది హాజరయ్యారు.

Advertisement
Update: 2023-01-23 06:20 GMT

రాబోయే ఏపీ ఎన్నికల్లో కూడా కీలకపాత్ర పోషించాలన్న కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగానే ఏపీలో బీఆర్ఎస్ అడుగులు జోరందుకున్నట్లు అర్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ కాపు మొదలైందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాపు సామాజికవర్గంలోని ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ భేటీలో గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఇంకా చాలా మంది హాజరయ్యారు.

ఏపీలోని కాపు ప్రముఖుల భేటీని హైదరాబాద్‌లో జరపటమే ఇక్కడ కీలకమైంది. బీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీల్లోని వీలైనంత మంది నేతలను చేర్చుకోవటమే టార్గెట్‌గా తోట పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో తనకు బాగా సన్నిహితులుగా ఉన్న కాపు ప్రముఖులు, ద్వితీయ శ్రేణి నేతలతో తోట టచ్‌లో ఉన్నారు. తోట టార్గెట్ అంతా ప్రధానంగా కాపు ప్రముఖులు, నేతలపైనే పెట్టారు. ఇందులో కూడా జనసేనలో యాక్టివ్‌గా ఉన్న వారిపైనే దృష్టి పెట్టారు.

ఎందుకంటే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులయ్యే ముందువరకు తోట జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కాబట్టే. జనసేన ప్రధాన కార్యదర్శిగా ఏపీలోని అన్నీ జిల్లాల్లోని కాపు నేతలతో గట్టి సంబంధాలున్నాయి. అంతేకాకుండా సామాజికవర్గంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ కారణంగానే ముందుగా తనకు బాగా సన్నిహితులైన కాపు ప్రముఖులు, నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.

ఇప్పుడు కూడా తోట నాయకత్వంలో జరిగిన భేటీలో టీడీపీ ఎమ్మెల్యే గంటా, బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా తదితరులు పాల్గొన‌డం కీలకమనే చెప్పాలి. కాపులు ఏ పార్టీలో ఉన్నా ప్రాధాన్యత దక్కించుకోవాలని భేటీ డిసైడ్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఏమాత్రం నిజంలేదు. ఎందుకంటే ఏ పార్టీలో కాపులు ఆ పార్టీలోనే ప్రాధాన్యత దక్కించుకోవాలని భేటీ డిసైడ్ చేసిందంటే ఇక ఈ భేటీకి అర్థం లేదు. వివిధ పార్టీల్లోని కాపులను బీఆర్ఎస్‌లోకి లాక్కోవటమే తోట ముఖ్య ఉద్దేశం. అందుకు ఎంతమంది సానుకూలంగా స్పందించారనేదే కీలకం. బహుశా రెండుమూడు రోజుల్లో ఈ విషయమై క్లారిటి వచ్చే అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News