వైసీపీ వర్సెస్ టీడీపీ.. మధ్యలో చీకోటి

తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో దమ్ముంటే ఈడీతో తనను అరెస్ట్ చేయించాలని కొడాలి నాని సవాళ్లు విసరడం, మరో మాజీ మంత్రి బాలినేని కూడా వివరణ ఇచ్చుకోవడం తెలిసిందే.

Advertisement
Update: 2022-08-01 04:59 GMT

Chikoti Praveen Kumar

వరద రాజకీయం అయిపోయింది, ఇప్పుడు ఏపీలో చీకోటి రాజకీయం మొదలైంది. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ మీ పార్టీకి ముఖ్యం అంటే మీ పార్టీకి ముఖ్యం అంటూ వైసీపీ, టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నేతలతో కలసి ఉన్న ఫొటోలను ఈ పార్టీ నేతలు, ఈ పార్టీ నేతలు తీసుకున్న సెల్ఫీలను ఆ పార్టీ నేతలు సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే వారు వీరు అనే బేధం లేకుండా.. ఆయన అందర్నీ సమంగా ఆదరించారు కాబట్టి విమర్శకులకు కూడా చేతినిండా పని దొరికింది.

వైసీపీ నేతలే టార్గెట్..

చీకోటి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగిన వెంటనే.. టీడీపీ రంగంలోకి దిగింది. గతంలో గుడివాడలో ఆయన క్యాసినో నిర్వహించారని, అప్పట్లోనే తాము ఆరోపణలు చేసినా పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో దమ్ముంటే ఈడీతో తనను అరెస్ట్ చేయించాలని కొడాలి నాని సవాళ్లు విసరడం, మరో మాజీ మంత్రి బాలినేని కూడా వివరణ ఇచ్చుకోవడం తెలిసిందే. ఇంకొందరు నేతల్ని కూడా టీడీపీ టార్గెట్ చేస్తూ.. వారి ఫొటోలతో పోస్టర్లు డిజైన్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోంది.

చీకోటి ప్రవీణ్ తో టీడీపీ నేత బోడె ప్రసాద్ సహా మరికొందరికి సంబంధాలున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి బంధాలన్నీ త్వరలో బయటకొస్తాయని చెబుతున్నారు. గతంలో టీడీపీ హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ తో సంబంధం ఉన్నవారికి, ఇప్పుడు చీకోటి క్యాసినో వ్యవహారంలో కూడా సంబంధాలున్నాయని అంటున్నారు.

ఈడీ విచారణ..

చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో వారితో సంబంధాలున్న నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్కడ చీకోటి ఎవరి పేర్లయినా బయటపెడతాడేమోననే అనుమానాలున్నాయి. సంబంధం లేకపోయినా కనీసం క్యాసినోలకు రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్న నేతల పేర్లయినా బయటకొచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ ఇవి కేవలం ఆరోపణలే అయినా.. చీకోటి నోరు విప్పితే ఇవి అధికారికం అవుతాయి. ఇక సినీ తారల్లో కూడా గుబులు మొదలైంది. క్యాసినోల కోసం వారు ఇప్పటి వరకూ ప్రచారం నిర్వహించారు, కొన్నిసమయాల్లో క్యాసినోలకు హాజరయ్యారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే కొన్నిపేర్లు బయటకొచ్చాయి. దీంతో వారు కూడా విచారణకు హాజరవుతారనే అనుమానాలున్నాయి. మొత్తమ్మీద ఇటీవల వరద రాజకీయం కాస్త శాంతించగానే.. ఏపీలో చీకోటి పాలిటిక్స్ మొదలయ్యాయి. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News