తప్పుడు సెంటిమెంటును ప్రయోగించిన రఘురామ

నరసాపురంలో ప్రధానమైన అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు చేసిన ఏ ముఖ్యమంత్రి తర్వాత ఎన్నికలో గెలవలేదనే బలమైన సెంటిమెంటు ఉందన్నారు. ఎన్టీయార్, వైఎస్సార్, చంద్రబాబు నాయుడు విషయంలో ఇదే సెంటిమెంటు పనిచేసిందని కూడా చెప్పారు.

Advertisement
Update: 2022-11-22 06:17 GMT

వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్న వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కొత్తగా పనికిమాలిన సెంటిమెంటును ప్రయోగించారు. పనికిమాలిన సెంటిమెంటు అనేకన్నా తప్పుడు సెంటిమెంటు అంటే బాగుంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే నరసాపురం హెడ్ క్వార్టర్స్ లో సోమవారం జగన్మోహన్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. అనేక అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు చేశారు. ఈ కార్యక్రమాలకు లోకల్ ఎంపీగా రఘురామ అడ్రస్ లేరు.

ఏపీలోకి అడుగుపెడితే ఏమవుతుందో బాగా తెలుసు కాబట్టే రఘురామ కనబడలేదు. నరేంద్ర మోడీ వచ్చినపుడు కూడా తనను నియోజకవర్గంలోకి రానీయలేదనే మంట ఎంపీలో బాగా పెరిగిపోతోంది. జగన్‌తో తనకున్న వైరం కారణంగా ఎంపీ నియోజకవర్గంలోకి కాదుకదా చివరకు రాష్ట్రంలోకే అడుగుపెట్టలేకపోతున్నారు. తనను ఢిల్లీకి మాత్రమే పరిమితం చేశారని జగన్‌పై ఎంపీలో కక్ష బాగా పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడంటు కొత్త సెంటిమెంటును బయటకు తీశారు.

ఇంతకీ విషయం ఏమిటంటే నరసాపురంలో ప్రధానమైన అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు చేసిన ఏ ముఖ్యమంత్రి తర్వాత ఎన్నికలో గెలవలేదనే బలమైన సెంటిమెంటు ఉందన్నారు. ఎన్టీయార్, వైఎస్సార్, చంద్రబాబు నాయుడు విషయంలో ఇదే సెంటిమెంటు పనిచేసిందని కూడా చెప్పారు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అప్పుడు జగన్ పరిస్ధితి ఏమవుతుందో తనకు అర్ధం కావటంలేదన్నారు. ఎంపీ చెప్పిందాంట్లోనే ఆ సెంటిమెంటు తప్పుడు సెంటిమెంటని అర్ధమవుతోంది.

ఎన్టీయార్, వైఎస్సార్, చంద్రబాబులు ముఖ్యమంత్రులుగా ఎప్పుడు శంకుస్ధాపనలు చేశారు? ఆ తర్వాత ఎప్పుడు ఓడిపోయారు? అనే విషయాలను ఎంపీ చెప్పలేదు. ఎన్టీయార్, చంద్రబాబు విషయం పక్కనపెట్టేసినా వైఎస్సార్ అయితే వరసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. 2004లో గెలిచి సీఎం అయిన వైఎస్ తర్వాత 2009లో కూడా గెలిచి సీఎం అయ్యారు. అంటే తిరుగుబాటు ఎంపీ చెప్పిన సెంటిమెంటు తప్పుడు సెంటిమెంటని అర్ధమవుతోంది కదా. జగన్ మీద ప్రయోగించటానికి అస్త్రాలు ఏమీలేక చివరకు తప్పుడు సెంటిమెంట్లను ఎంపీ ప్రయోగిస్తున్నట్లుంది.

Tags:    
Advertisement

Similar News