ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని స్థితిలో పవన్.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

వైసీపీని ఓడిస్తామని పవన్ క‌ళ్యాణ్‌ ప్రగల్బాలు పలుకుతున్నాడని, జనసేన పార్టీ 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకోలేని పరిస్థితిలో ఉందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

Advertisement
Update: 2022-12-10 09:22 GMT

పవన్ కళ్యాణ్ ఎవరిపై యుద్ధం చేయాలో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడని ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనాన్ని పరిచయం చేసినప్పటి నుంచి పవన్, వైసీపీ మంత్రుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జోరుగా సాగుతున్నాయి. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తున్నాడు. మొగలాయిల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో పలు యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు.

అందుకోసం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఒక కత్తి చేత పట్టుకొని ఉన్న ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా ఇవాళ తిరుపతిలో ఏపీ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధిపై సౌత్ జోన్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కత్తులు చేత పట్టుకొని ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడని విమర్శించారు. ఆయన ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీని ఓడిస్తామని పవన్ ప్రగల్బాలు పలుకుతున్నాడని, జనసేన పార్టీ 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకోలేని పరిస్థితిలో ఉందని రోజా ఎద్దేవా చేశారు.

తాను శ్వాస తీసుకోవడానికి కూడా వైసీపీ అనుమతి తీసుకోవాలా? అని పవన్ అంటున్నారని.. అయితే ఆయన బతికేది హైదరాబాద్‌లో కాబట్టి పవన్ శ్వాస తీసుకోవాలా.. వద్దా..అన్నది చెప్పాల్సింది కేసీఆర్, కేటీఆర్‌లే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలిచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను జగన్ హైదరాబాద్‌కు పంపడం ఖాయమని రోజా పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News