జగన్ తో రోజా భేటీ.. తాడోపేడో తేల్చుకోడానికి రెడీ

నగరి పంచాయితీని తాడేపల్లికి చేర్చారు మంత్రి రోజా. సీఎం జగన్ ను కలసి ఆమె నేరుగా ఫిర్యాదు చేశారు. నగరిలో సొంత పార్టీ నేతలే తనకు వెన్నుపోటు పొడుస్తున్నారని జగన్ వద్ద ఆమె వాపోయినట్టు తెలుస్తోంది.

Advertisement
Update: 2022-10-26 14:57 GMT


నగరి నియోజకవర్గంలో తనను బలహీన పరిచేందుకు సొంత పార్టీ నేతలే గోతులు తవ్వుతున్నారంటూ మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేసిన ఆడియో క్లిప్ ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అలాంటిదేమీ లేదంటూ పార్టీ వర్గాలు సర్దిచెప్పుకున్నా.. రోజా మాత్రం వైరివర్గాల అంతు చూసే వరకు నిద్రపోనంటున్నారు. నగరి పంచాయితీని తాడేపల్లికి చేర్చారు. సీఎం జగన్ ను కలసి ఆమె నేరుగా ఫిర్యాదు చేశారు. శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌ రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్‌ పర్సన్‌ కేజే శాంతి, నగరి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కేజే కుమార్‌, ఏలుమలై, లక్ష్మీపతిరాజుపై రోజా సీఎం జగన్ కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. వారి వెనక ఉన్న పెద్దాయన పెద్దిరెడ్డిపై కూడా పరోక్షంగా జగన్ కు ఫిర్యాదు చేశారట రోజా.

ఎందుకీ గొడవంతా..?

వైసీపీలో రోజా పాపులర్ లీడర్. జగన్ పై ఈగవాలనీయకుండా ప్రత్యర్థులపై మాటలదాడి చేయడంలో ఆమె నేర్పరి. అయితే జగన్ వద్ద పలుకుబడి ఉన్నా కూడా స్థానికంగా నగరి నియోజకవర్గంలో ఆమెకు రాజకీయ శత్రువులు ఎక్కువయ్యారు. అందులో సొంత పార్టీ నేతలు ఉండటం విశేషం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో వారంతా రోజాను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఆమధ్య స్థానిక ఎనికల్లో తనవర్గం వారికి పదవులు ఇప్పించుకోలేని పరిస్థితుల్లో రోజా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కూడా. ఆ తర్వాతే గొడవలు మరింత పెరిగి పెద్దవయ్యాయి. చివరకు రోజా ఆడియో బయటకు రావడం, ఆ తర్వాత వెంటనే సీఎం జగన్ ని కలవడం చకచకా జరిగిపోయాయి.

ఇటీవల నిండ్ర మండలం కొప్పేడులో మంత్రి రోజాకు సమాచారం లేకుండా ఆమె వైరి వర్గం నాయకులు రైతు భరోసా కేంద్రం, వెల్‌ నెస్‌ కేంద్రానికి భూమిపూజ చేశారు. దీనిపై రోజా తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా అభివృద్ధి పనులు ఎలా మొదలు పెడతారని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేకే విలువ ఇవ్వకపోతే ప్రజల్లో పార్టీ పలుచన అయిపోతుందని అన్నారు రోజా. మరోవైపు ఇక్కడ జనసేన నాయకులు కూడా మంత్ర రోజాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారికి కూడా వైసీపీ నేతల సపోర్ట్ ఉందని అనుమానిస్తున్నారు రోజా. మొత్తమ్మీద ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనంటూ రోజా నేరుగా జగన్ ని కలిశారు. ఆయన ఇచ్చిన హామీ ఏంటి..? ఇకనైనా రోజా వ్యతిరేక వర్గం సైలెంట్ అవుతుందా..? ముందు ముందు తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News