డయాఫ్రమ్ వాల్ పై తర్జన భర్జన.. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే..?

పోలవరం పనులు ఆలస్యం కావడం తనకెంతో బాధగా ఉందని అన్నారు అంబటి రాంబాబు. మూడుసార్లు వరదల కారణంగా లోయర్ కాఫర్ డ్యామ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయామని వివరించారు.

Advertisement
Update: 2022-10-22 09:23 GMT

ఇటీవల జనసేన వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ లో ఏపీ మంత్రుల్ని జనసైనికులు సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. పవన్ కల్యాణ్ ని విమర్శించడం మానేసి ముందు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చూడండి అంటూ సెటైర్లు వేశారు. ఆ మాటలకి రోషమొచ్చిందో, లేక నిజంగానే పోలవరం పనుల పురోగతిపై సమీక్షించాలనుకున్నరో కానీ.. హడావిడిగా మంత్రి అంబటి రాంబాబు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు. ఊహించని విధంగా ఈ సీజన్లో గోదావరికి వరదలు రావడంతో ప్రాజెక్ట్ ఆలస్యం అయిందని చెప్పారు అంబటి.

నా బాధంతా అదే..

పోలవరం పనులు ఆలస్యం కావడం తనకెంతో బాధగా ఉందని అన్నారు అంబటి రాంబాబు. మూడు సార్లు వరదల కారణంగా లోయర్ కాఫర్ డ్యామ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయామని వివరించారు. వరద మరింత తగ్గుముఖం పట్టాక డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. కాఫర్ డ్యామ్‌ నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడమే గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పు అని విమర్శించారు అంబటి. ఆ తప్పుల వల్లే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.

నేరం మాది కాదు..

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని టీడీపీ, జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారని, కానీ పోలవరం పూర్తి కాకపోవడానికి అసలు కారణం టీడీపీయేనని అన్నారు అంబటి. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో కేంద్ర, రాష్ట్రాలు తర్జనభర్జన పడుతున్నాయని చెప్పారు. అయితే ఎప్పటికైనా పోలవరం పూర్తిచేసేది వైసీపీ ప్రభుత్వమేనని, పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసేది జగనేనని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News