ఆసక్తి రేపుతున్న వైఎస్ జగన్ - మార్గాని నాగేశ్వరరావు భేటీ

Advertisement
Update: 2022-07-27 11:25 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో బీసీ సంఘాల సమైక్య కన్వీనర్ మార్గాని నాగేశ్వరావు భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గోదావరి వరద ప్రాంతాల పరిశీలన, బాధితుల పరామర్శ కోసం సీఎం జగన్ రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. మొదటి రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. అక్కడికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌తో పాటు ఆయన తండ్రి నాగేశ్వరరావు కూడా వచ్చారు.

ఆర్ అండ్ బీ వసతి గృహంలో సీఎం జగన్ - మార్గాని నాగేశ్వరరావు దాదాపు గంట సేపు భేటీ అయినట్లు తెలుస్తుంది. బీసీల్లో మంచి పట్టున్న నాయకుడిగా నాగేశ్వరరావుకు పేరుంది. మొదటి నుంచి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బీసీ ఉద్యమాల్లో నాగేశ్వరరావు చురుకుగా పాల్గొన్నారు. నాగేశ్వరరావు పలుకుబడి చూసే అప్పట్లో చిరంజీవి తాను పెట్టిన ప్రజా రాజ్యంలో చేర్చుకున్నారు. ఆ పార్టీలో కూడా క్రియాశీలకంగా పని చేశారు. అయితే తాను ఆశించిన రాజమండ్రి ఎంపీ సీటు రాకపోవడంతో అసంతృప్తితో పార్టీని వీడారు. ఆ సమయంలో యువరాజ్యంలో ఉన్న కొడుకు మార్గాని భరత్‌తో కూడా రాజీనామా చేయించారు.

కొంత కాలం రాజకీయాల జోలికి వెళ్ల‌ని నాగేశ్వరరావు.. ఆ తర్వాత కొడుకును వైసీపీలో జాయిన్ చేశారు. గత ఎన్నికల్లో భరత్‌కు రాజమండ్రి టికెట్ వచ్చిన తర్వాత తెర వెనుక నాగేశ్వరరావు పని చేశారు. వైసీపీలో జాయిన్ అవ్వ‌కపోయినా కొడుకు కోసం తన పరిచయాలు వాడారు. బీసీల్లో నాగేశ్వరరావుకు ఉన్న పలుకుబడే భరత్ గెలుపున‌కు కారణమైందని స్థానికులు చెప్తుంటారు. ఇప్పటికీ నాగేశ్వరరావుకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని బీసీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. బీసీలు నాగేశ్వరరావు మాటకు విలువ ఇస్తారు.

ఇక ఇటీవల కొన్ని సర్వేలు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీకి మునుపటి కంటే ఆదరణ తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాలకు అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు జరిగిన ఘర్షణలు పార్టీకి మచ్చ తీసుకొని వచ్చాయి. దీంతో వైఎస్ జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆ జిల్లాలో బీసీ నాయకుడిగా, తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల సమైక్య కన్వీనర్‌గా ఉన్న మార్గాని నాగేశ్వరరావుతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మార్గాని నాగేశ్వరరావును కూడా పార్టీలో చేర్చుకొని ఎంపీ సీటు కేటాయించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు వచ్చే ఎన్నికలకు పార్టీలో ఉండేది లేదు. ఆయన స్థానంలో మార్గాని నాగేశ్వరరావును బరిలోకి దించితే, ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సీట్లపై ప్రభావం ఉంటుంది. సీఎం జగన్ కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.

రాజమండ్రిలో జరిగిన భేటీలో ఇద్దరి మధ్య ఇదే చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మార్గాని నాగేశ్వరరావు మాత్రం ఈ భేటీ కేవలం మార్యాదపూర్వకమే అని అన్నారు. రాజమండ్రి వచ్చినందుకే సీఎంను కలిశానని, కొడుకు ఎంపీ కావడంతో తనను తీసుకొని వెళ్లారని చెప్తున్నారు. ఏదేమైనా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక బలమైన బీసీ నాయకుడిని వైసీపీ తరపున నిలబెట్టాలని సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటని చర్చ జరుగుతుంది.

Tags:    
Advertisement

Similar News