ఏడాది అయింది, ఆ రేపిస్ట్ సంగతేంటి..?

ఏపీలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. మహిళపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో దేశంలోని మొదటి 10 స్థానాల్లో ఏపీ కూడా ఉందని గుర్తు చేశారు.

Advertisement
Update: 2022-09-20 01:38 GMT

దిశ చట్టం చేశాం, పోలీస్ స్టేషన్లు పెట్టామని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు కానీ, రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. ఏపీలో ఆడబిడ్డలకు ప్రభుత్వం ధైర్యం ఇవ్వలేకపోతోందని విమర్శించారు. ఏపీలో గిరిజన మహిళలపై అత్యాచార, హత్య ఘటనలు కలచి వేశాయంటున్న పవన్, మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు అంటూ ట్విట్టర్లో ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఇప్పటి వరకూ దిక్కులేదు..

రాష్ట్ర పాలకుడు ఇంటికి సమీపంలో కృష్ణా నది ఒడ్డున ఓ యువతిపై అత్యాచారం జరిగి ఏడాది దాటినా ఇప్పటికీ ఆ ఘటనలో నిందితుడిని పట్టుకోలేకపోయారని విమర్శించారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో పోలీసింగ్, శాంతిభదత్రల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు రోజు రోజుకీ పెరగటం కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. మహిళల‌పై అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో దేశంలోని మొదటి 10 స్థానాల్లో ఏపీ కూడా ఉందని గుర్తుచేశారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలు చూసిన తర్వాత అయినా ప్రభుత్వంలో చురుకు పుట్టాల్సి ఉందని అన్నారు పవన్. ఏపీలో నేరాలు, ఘోరాలు పెరుగుతున్నా ప్రభుత్వం చూసీ చూడనట్టుగా మౌనంగా, ఉదాసీనంగా ఉండటం ఆడబిడ్డలకు శాపంగా మారిందని మండిపడ్డారు.

హోం మంత్రి బాధ్యత ఇదేనా..?

అత్యాచార ఘటనలపై బాధ్యతతో తీవ్రంగా స్పందించాల్సిన హోంమంత్రి.. తల్లి పెంపకంలోనే తప్పు ఉందని, దొంగతనానికి వచ్చి అత్యాచారం చేసి ఉంటారంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను పవన్ గుర్తుచేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో తేలిగ్గా మాట్లాడటం వల్లే మృగాళ్లు పెట్రేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు అండగా లేని దిశ చట్టాల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారాయన. ప్రభుత్వంలోని పెద్దలు ఇలాంటి ఘటనలపై స్పందించరని, ఇతర విషయాల్లో మాత్రం ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తారని అన్నారు. ప్రజలకు కష్టం కలిగితే ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు.

Tags:    
Advertisement

Similar News