షాతో ఎన్టీఆర్ భేటీ.. పవన్ కల్యాణ్ అంత ఫీలయ్యారా..?

తెలంగాణ పర్యటనలో కొమరం భీమ్ ని కలసిన అమిత్ షా, భీమ్లా నాయక్ ని మాత్రం పట్టించుకోలేదు. అసలు జనసేన, బీజేపీ మధ్య ఏం జరుగుతోంది..?

Advertisement
Update: 2022-08-23 03:22 GMT

అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ జరిగి రెండురోజులవుతోంది. ఈ గ్యాప్ లో ఈ భేటీ గురించి చిలువలు పలువలుగా ప్రచారంలోకి వచ్చేశాయి. చంద్రబాబుని పక్కనపెట్టారని, అమిత్ షా కొత్త వ్యూహంతో ఉన్నారనే మాటలు వినపడుతున్నాయి. అయితే ఈ ఎపిసోడ్ తో సంబంధం లేకపోయినా జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవల రెండురోజులుగా పవన్ ప్రసంగాలు, మాటలు వింటే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది.

ఆ మధ్య ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చినా, కనీసం పవన్ కు ఇన్విటేషన్ కూడా వెళ్లలేదు. ఇప్పుడు తెలంగాణకు అమిత్ షా వచ్చినా పలకరించే అవకాశం కూడా లేదు. పోనీ పవన్ ఏపీకే పరిమితం అయ్యారా అంటే అదీ లేదు, తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన సపోర్ట్ కోరుతోంది. మరి పవన్ ని ఉద్దేశపూర్వకంగానే బీజేపీ పక్కనపెట్టిందా, పవన్ కల్యాణ్ కూడా అదే కోరుకుంటున్నారా..? తెలంగాణ పర్యటనలో కొమరం భీమ్ ని కలసిన అమిత్ షా, భీమ్లా నాయక్ ని మాత్రం పట్టించుకోలేదు. అసలు జనసేన, బీజేపీ మధ్య ఏం జరుగుతోంది..?

బీజేపీ అధినాయకత్వం తనను పట్టించుకోవడంలేదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా త్వరగానే అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన ప్రసంగాలు, స్టేట్ మెంట్లు అన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో కుటుంబ సభ్యులతో స‌హా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలిసొచ్చిన కేసీఆర్, ఆ తర్వాత మనసు మార్చుకుని ఒంటరిగా పోటీ చేశారని, అలాగే ఏపీలో కూడా తమ వ్యూహాలు ఉంటాయని, రాజకీయ అవసరాలకోసం వ్యూహాలు మార్చుకుంటామని చెప్పారు. ఒక రకంగా బీజేపీతో వెళ్లడం ఇష్టం లేదనే విషయాన్ని కుండబద్దలు కొట్టారు పవన్.

మూడో ప్రత్యామ్నాయం అంటే..?

మూడో ప్రత్యామ్నాయం ఉండడం దేశానికి కానీ.. రాష్ట్రానికి కానీ చాలా అవసరం అని అన్నారు పవన్ కల్యాణ్. ప్రస్తుతానికి జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోరు అనుకుంటున్నా.. మూడో కూటమికి విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ మూడో ప్రత్యామ్నాయం కావాలంటున్నారంటే, బీజేపీని వద్దంటున్నట్టే లెక్క. బీజేపీకి నచ్చినా.. నచ్చకపోయినా.. మూడో ప్రత్యామ్నాయం ఉండాల్సిందేనన్నారు పవన్ కల్యాణ్. ఇది కచ్చితంగా బీజేపీపై ధిక్కార స్వరమే అనుకోవాలి.

వైసీపీ వ్యతిరేక ఓటుపైనే గురి..

ఇన్ని చెబుతున్న పవన్ కల్యాణ్ చివరకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటున్నారు. అంటే కచ్చితంగా విపక్షాలన్నీ ఏకం కావాలనేది ఆయన ఆలోచన. అదే సమయంలో ఆ విపక్ష కూటమికి తానే నాయకత్వం వహించాలన్న ఆలోచన కూడా ఆయనకు ఉంది. మొత్తమ్మీద బీజేపీ అగ్రనాయకత్వం పవన్ ను పట్టించుకోకపోగా, ఎన్టీఆర్ తో భేటీ కావడం, ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తడం కూడా జనసైనికులకు ఇబ్బందిగానే ఉంది. అమిత్ షా - ఎన్టీఆర్ భేటీ గురించి పవన్ కి ప్రశ్నలు ఎదురైనా.. ఆయన నో కామెంట్ అంటున్నారట.

Tags:    
Advertisement

Similar News