చివరకు జనసేనను ఏం చేస్తారు..?

ప్రత్యక్ష రాజకీయాల్లో జగన్, కేజ్రీవాల్ కంటే సీనియర్, సినీ హీరోగా బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉండి కూడా పవన్ ఎందుకు ఫెయిలవుతున్నారు..? ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వాలనే తపన, కసి లేకపోవటమే కారణం.

Advertisement
Update: 2022-12-11 08:59 GMT

ఇప్పుడిదే ఎవరికీ అర్థంకావటం లేదు. ప్రజారాజ్యంపార్టీ ద్వారా పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది 2008లో. అది ఎత్తిపోయిన తర్వాత సొంతంగా జనసేన అంటూ పార్టీ పెట్టింది 2014లో. ఇంతవరకు జనసేనకు దిక్కు దివాణం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది 2009లో. అంటే పవన్ కన్నా జగన్ వన్ ఇయర్ జూనియర్. రెండుసార్లు ఎంపీగా గెలిచారు. తండ్రి వైఎస్సార్ చనిపోయిన తర్వాత జరిగిన తీవ్ర‌ పరిణామాల్లో నేప‌థ్యంలో కాంగ్రెస్‌ను వీడారు.

2011లో సొంతంగా వైఎస్సార్పీపీ అని పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటిసారి ప్రతిపక్షనేతగా, రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక‌య్యారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) స్థాపించి, ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయిపోయారు. మొన్నటి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆప్ కు ఏకంగా జాతీయపార్టీ హోదా కూడా వచ్చేసింది.

ప్రత్యక్ష రాజకీయాల్లో జగన్, కేజ్రీవాల్ కంటే సీనియర్, సినీ హీరోగా బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉండి కూడా పవన్ ఎందుకు ఫెయిలవుతున్నారు..? ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వాలనే తపన, కసి లేకపోవటమే కారణం. ఎంతసేపూ ఎవరితో పొత్తు పెట్టుకుందామా అనిచూడటం, రాజకీయాలను సీరియస్ గా తీసుకోకపోవటం, సినిమా షూటింగుల గ్యాప్ లో రాజకీయాలు చేయటం వల్లే జనాలు పవన్‌ను ప‌ట్టించుకోవటంలేదు. ఏ విషయంలో కూడా స్థిరమైన అభిప్రాయం లేకపోవటం, విషయ పరిజ్ఞానం సాధించ‌క‌పోవ‌డం, మాట స్థిరత్వం లేకపోవటం అదనపు మైనస్సులు. వీటికి అదనంగా ఓపిక చాలా తక్కువ.

పవన్ ఇదే పద్ధ‌తిలో ఉంటే ఎన్ని సంవత్సరాలైనా జనసేన పార్టీ ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పొంద‌లేదు. పవన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు. ఒకవైపు చంద్రబాబు నాయుడు, జగన్ 24 గంటలు, 365 రోజులు రాజకీయమే ఊపిరిగా బతుకుతుంటే పవన్ మాత్రం పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తానంటే ఎలా కుదురుతుంది..? చివరకు అన్న చిరంజీవిలా పవన్ కూడా నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచేస్తారా..? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంతా మునిగిపోయిన తర్వాత చివరకు జనసేనను ఏమిచేస్తారో ఏమో..?

Tags:    
Advertisement

Similar News