చేతులారా నియోజకవర్గాన్ని పోగొట్టుకుంటోందా..?

రెండురోజుల క్రితం గొడవలు సర్దుబాటు కోసమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సమావేశం పెట్టారు. రెండువర్గాలు ఒకేచోట చేరటంతో మళ్ళీ గొడవలై చివరకు బుచ్చయ్య ముందే కొట్టుకున్నారు.

Advertisement
Update: 2022-12-01 07:02 GMT

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీకి బలమైన పునాదుంది. 1985 సంవత్సరం నుండి తీసుకుంటే జరిగిన 7 ఎన్నికల్లో టీడీపీ ఆరుసార్లు గెలిచింది. దీంతోనే టీడీపీ ఇక్కడ ఎంతబలంగా ఉందనేది అర్థ‌మైపోతోంది. ఇలాంటి నియోజకవర్గాన్ని ఇప్పుడు చేతులారా చెడగొట్టుకుంటోంది. ఓపెన్ క్యాటగిరిలో నుంచి 2009లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారింది.

2009లో టీడీపీ తరపున టీవీ రామారావు గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు రామారావు వైసీపీలో చేరటంతో చంద్రబాబు నాయుడు కొత్తగా జవహర్‌ను రంగంలోకి దింపారు. 2004 వరకు నియోజకవర్గంలో పెండ్యాల వెంకట కృష్ణారావుకు తిరుగేలేదు. 1983లో ఇండిపెండెంట్ గా గెలిచిన కృష్ణారావు తర్వాత టీడీపీలో చేరి వరుసగా 4సార్లు గెలిచారు. నియోజకవర్గం ఎప్పుడైతే ఎస్సీ రిజర్వుడుగా మారిందో అప్పటి నుంచి కృష్ణారావు మాజీ అయిపోయారు.

దానికితోడు 2014లో గెలిచిన జవహర్ వెంటనే మంత్రికూడా అయిపోయారు. దాంతో నియోజకవర్గంలో కృష్ణారావు-జవహర్ వర్గాలుగా టీడీపీ చీలిపోయింది. జవహర్‌కు నోటిదురుసు ఎక్కువనే ప్రచారముంది. దీనివల్ల కృష్ణారావు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటంతోనే ఇద్దరికీ బాగా చెడిందంటున్నారు. అప్పటి నుంచి జవహర్ కు సమస్యలు మొదలయ్యాయి. ఇప్పుడు విషయం ఏమిటంటే పార్టీలో మెజారిటివర్గం కృష్ణారావుతో ఉంది. దాంతో మాజీమంత్రి ఒంటరైపోయారు.

ఈ కారణంగానే 2019 ఎన్నికల్లో కొవ్వూరులో టికెట్టే దక్కలేదు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు కూడా మాజీ మంత్రిని పిలవటంలేదు. ఒకవేళ జవహర్ హాజరైనా వేదికమీదకు ఎక్కనీయటంలేదు. దీంతో జవహర్ కు కృష్ణారావుతో బాగా గొడవలవుతున్నాయి. రెండురోజుల క్రితం గొడవలు సర్దుబాటు కోసమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సమావేశం పెట్టారు. రెండువర్గాలు ఒకేచోట చేరటంతో మళ్ళీ గొడవలై చివరకు బుచ్చయ్య ముందే కొట్టుకున్నారు. దాంతో చేసేదిలేక బుచ్చయ్య మీటింగ్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. జరుగుతున్నది చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ చేతులారా.. ఒక సీటును కోల్పోవటం ఖాయమనిపిస్తోంది.

Advertisement

Similar News