బీజేపీ లిస్టుతో కూటమిలో చిచ్చు..!

అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా మొదటి జాబితాలోనే ప్రకటించింది. అప్పటినుంచి ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.

Advertisement
Update: 2024-03-28 03:12 GMT

పొత్తులో భాగంగా ఏపీలోని 10 అసెంబ్లీ స్థానాలకు బుధవారం బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ లిస్టు కూటమిలోని అన్ని పార్టీల్లో చిచ్చు పెట్టింది. ఎచ్చెర్ల, అనపర్తి, ధర్మవరం, విజయవాడ వెస్ట్ స్థానాల్లో టికెట్లు ఆశించిన టీడీపీ, జనసేన ఆశావహుల ఆశలపై బీజేపీ నీళ్లు చల్లింది.

అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా మొదటి జాబితాలోనే ప్రకటించింది. అప్పటినుంచి ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఆ స్థానంలో ఎం. శివకృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అనపర్తిలో నల్లమిల్లి అనుచరులు భగ్గుమన్నారు. నల్లమిల్లికే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. నల్లమిల్లి సైతం ఇవాళ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ట్వీట్ చేశారు. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం కీలక నిర్ణయం తీసుకోబోతున్నానని స్పష్టం చేశారు. ఇక అరకులోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. అరకు నుంచి గతంలోనే దొన్ను దొరను తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించగా.. బీజేపీ తాజా లిస్టులో పాంగి రాజారావును అభ్యర్థిగా ప్రకటించింది.

ఇక ఎచ్చెర్ల నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళావెంకట్రావు టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఎచ్చెర్ల టికెట్ బీజేపీకి కేటాయించారు. దీంతో కళా వెంకట్రావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇక ధర్మవరం నుంచి బీజేపీ నేత వరదాపురం సూరి, టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ టికెట్లు ఆశించారు. కానీ బీజేపీ అనూహ్యంగా ధర్మవరం సీటును వై.సత్యకుమార్‌కు కేటాయించింది. దీంతో వరదాపురం సూరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

ఇక విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్‌కు బీజేపీ లిస్టుతో షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరిని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. విజయవాడ వెస్ట్ సీటు కోసం పోతిన తీవ్ర ప్రయత్నాలు చేశారు. పవన్‌కల్యాణ్‌ను మూడు, నాలుగు సార్లు కలిసి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం పోతినతో పాటు ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News