విద్య, వ్యవసాయం, సచివాలయం.. ఏపీ మూడు సూత్రాలు..

ఎరువులు, పురుగు మందులు, విత్తనాల పంపిణీ ఆర్బీకేల ద్వారా చేపడుతున్నట్టు వివరించారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ సమర్థవంతంగా అమలవుతుందని చెప్పారు.

Advertisement
Update: 2022-08-08 02:24 GMT

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ప్రగతిని సీఎం జగన్ వివరించారు. విద్య, వ్యవసాయం, సచివాలయం.. ప్రధానంగా ఈ మూడింటిని ఆయన తన ప్రసంగంలో హైలైట్ చేశారు. ఆయా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, వాటి పర్యవసానాలను వివరించారు. వ్యవసాయ రంగంలో ఉన్న రిస్క్‌ ను దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా అందిస్తున్నట్టు తెలిపారు. ఉచిత పంటల బీమా చెల్లిస్తున్నట్టు చెప్పారు. రైతులకు వడ్డీలేని రుణాలు, 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ తదితర పథకాలతో అన్నదాతలకు మేలు చేకూరుస్తున్నట్టు వివరించారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల పంపిణీ ఆర్బీకేల ద్వారా చేపడుతున్నట్టు వివరించారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ సమర్థవంతంగా అమలవుతుందని చెప్పారు.

విద్యారంగంలో సంస్కరణలు..

ఏపీలో బడి మానేసే విద్యార్థుల సంఖ్యను పూర్తిగా తగ్గించడం కోసం తల్లిదండ్రుల పేదరికం పిల్లల చదువులకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు జగన్. విద్యార్థులకు మరింత నాణ్యతతో బోధన కోసం బైజూస్‌ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వివరించారు. మనబడి నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో సౌకర్యాలను పెంపొందిస్తున్నామని చెప్పారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తున్నామని వివరించారు.

సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం..

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సాధిస్తున్నామని నీతిఆయోగ్ సమావేశంలో తెలిపారు సీఎం జగన్. ఏపీలో 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల చెంతకే సేవలు తీసుకెళ్లామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడంతోపాటు, పారదర్శక పాలనకు సచివాలయ వ్యవస్థ ఉపయోగపడుతోందన్నారు. అధికార వికేంద్రీకరణకోసం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టామన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నీతి ఆయోగ్ సమావేశంలో ఒక నోట్ సమర్పించారు సీఎం జగన్.

Advertisement

Similar News