బాబులో మార్పు మొదలైంది..! అభ్యర్థుల ఎంపికలో కొత్త ఫార్ములా

జనసేనకు వదిలేసే నియోజకవర్గాలేంటో ముందుగానే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే కచ్చితంగా చంద్రబాబు ఈ ఏడాదిలోనే అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది.

Advertisement
Update: 2023-03-20 14:18 GMT

ఎన్నికలొస్తున్నాయంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో అందరూ హడావిడి పడిపోతుంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఎప్పుడూ నింపాదిగానే ఉంటారు. రేపు నామినేషన్ల ఆఖరు అంటే, ఈరోజు రాత్రికి అభ్యర్థిని ఖరారు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి చంద్రబాబు ఇకపై ఆ పద్ధతికి స్వస్తి చెబుతున్నారని తెలుస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా ఈ వ్యవహారంపై హింటిచ్చారు. ఈ దఫా అభ్యర్థుల ఎంపికలో టీడీపీ స్పీడ్ గా ఉంటుందని చెప్పారు.

ఇప్పటి వరకూ అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, ఈసారి మాత్రం చాలా త్వరగా అభ్యర్థుల్ని ఎంపిక పూర్తిచేస్తామని అన్నారు అచ్చెన్నాయుడు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన మీటింగ్ లో అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఎవరనే విషయం త్వరగానే తేలిపోతుందనమాట. గతంలోలాగా జాగుబేరం కాకుండా త్వరగానే ఆ వ్యవహారం తేల్చేస్తారనమాట చంద్రబాబు. అచ్చెన్నాయుడు మాటలు వింటే అదే నిజమనిపిస్తోంది.

జెట్ స్పీడ్ లో జగన్..

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనే విషయంలో సీఎం జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కుప్పం సహా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించుకుంటూ వస్తున్నారు. రెబల్స్ పై వేటు వేస్తూ వెంకటగిరి, నెల్లూరు రూరల్ కి కూడా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేశారు. కొన్నిచోట్ల సిట్టింగ్ లకు పొగబెట్టే కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఇన్ చార్జ్ లను ప్రకటిస్తూ ఉండవల్లి శ్రీదేవిలాంటి ఎమ్మెల్యేలకు ముందుగానే హింటిచ్చారు. అస్త్ర సన్యాసం చేస్తాం, మా పిల్లల్ని బరిలోకి దింపుతాం అంటున్న పేర్ని నాని, ధర్మాన వంటి వారికి కూడా కుదరదని సంకేతాలు పంపించారు. అవసరమైతే ముందుగానే కొందరికి ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, మరికొందరికి సీటు కన్ఫామ్ అనే సంకేతాలు పంపిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో జగన్ స్పీడ్ ని చంద్రబాబు అందుకోలేకపోతున్నారు.

గతంలో కూడా వలస నాయకులపై చంద్రబాబు ఆధారపడేవారు. చివరి నిమిషం వరకు వేచి చూసి అభ్యర్థులను ఖరారు చేసేవారు. ఈసారి మాత్రం అలాంటి ఆలస్యం అసలుకే మోసం తెస్తుందని పార్టీ వర్గాలంటున్నాయి. పైగా జనసేనతో పొత్తుల కుంపటి ఉండనే ఉంది. జనసేనకు వదిలేసే నియోజకవర్గాలేంటో ముందుగానే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే కచ్చితంగా చంద్రబాబు ఈ ఏడాదిలోనే అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఈసారి వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేస్తామంటున్నారు.

Tags:    
Advertisement

Similar News