చంద్రబాబు ‘స్కిల్’ నిరూపించగలరా?

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉండ‌వ‌చ్చు. కానీ ఆ డబ్బంతా చంద్రబాబు దగ్గరకే చేరిందని ప్రభుత్వం నిరూపించగలదా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబే సూత్ర‌ధారి అని యావత్ ప్రపంచం గట్టిగా నమ్మిన ఆ కేసులోనే ఏమీకాలేదు. ఒకవేళ అవినీతికి పాల్పడినా ప్రత్యర్థులకు దొరికిపోయేంత తెలివితక్కువగా చంద్రబాబు వ్యవహరిస్తారా?

Advertisement
Update: 2023-03-21 05:53 GMT

స్కిల్ స్కాం సూత్రధారి చంద్రబాబే.. విద్యార్థుల‌ పేరుతో దేశంలో జరిగిన అతి పెద్ద స్కాం ఇది..షెల్ కంపెనీలకు ప్రభుత్వ సొమ్ము జమైంది.. దోపిడీ సొమ్మంతా మళ్ళీ చంద్రబాబు దగ్గరకే చేరింది.. కీలక వ్యక్తులు బయటకు రాక తప్పదు..ఇది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు. అంతాబాగానే ఉంది కానీ ఆరోపణలను ఆరోపణల వరకే పరిమితం చేస్తారా? లేకపోతే తిరుగులేని ఆధారాలతో నిరూపించేదేమైనా ఉందా? అన్నదే ఇక్కడ కీలకమైనది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబుపై జగన్ అండ్ కో చాలా అవినీతి ఆరోపణలు చేసింది. అమరావతి భూములకు సంబంధించి ఇన్ సైడర్ ట్రేడింగ్‌ అన్నారు. ఫైబర్ గ్రిడ్‌లో వేలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. తాత్కాలిక భవనాల పేరుతో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణంలో చంద్రబాబు వందల కోట్లు తినేశారని గోల చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలను డిజైన్ల పేరుతో దుర్వినియోగం చేశారని పదేపదే ఆరోపించారు.

ఇలాంటి ఆరోపణలు చాలానే చేశారు కానీ ఏ ఒక్కదాన్ని నిరూపించలేకపోయారు. ఆరోపణలపై పెట్టిన కేసులు కోర్టుల్లో మగ్గుతున్నాయి. ఒక్కదానిలోనూ విచారణ ముందుకు సాగటంలేదు. ఇవన్నీ ఇలా ఉండగానే తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్‌ ముసుగులో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని గోల మొదలుపెట్టారు. ఇలాంటి ఆరోపణలు ఎన్ని చేసినా చంద్రబాబుకు వచ్చే నష్టమేమీలేదు. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలను జనాలు కూడా పెద్దగా పట్టించుకోరు. చంద్రబాబు మిస్టర్ క్లీన్ అని ఎవరూ అనుకోవటంలేదు. ఇదే సమయంలో అవినీతిపరుడని ఆధారాలతో కోర్టులో నిరూపించిందీ లేదు.

కాబట్టి ఆరోపణలన్నీ ఆరోపణలుగానే మిగిలిపోతాయి. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలన్నీ మామూలే కాబట్టే జనాలు కూడా పెద్దగా స్పందించరు. ఇప్పుడు జగన్ చెప్పిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కూడా వందల కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉండ‌వ‌చ్చు. కానీ ఆ డబ్బంతా చంద్రబాబు దగ్గరకే చేరిందని ప్రభుత్వం నిరూపించగలదా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబే సూత్ర‌ధారి అని యావత్ ప్రపంచం గట్టిగా నమ్మిన ఆ కేసులోనే ఏమీకాలేదు. ఒకవేళ అవినీతికి పాల్పడినా ప్రత్యర్థులకు దొరికిపోయేంత తెలివితక్కువగా చంద్రబాబు వ్యవహరిస్తారా? దొరకనంత వరకు అందరు దొరలే.

Tags:    
Advertisement

Similar News