పార్టీల్లో 'బీసీ' భజన పెరిగిపోతోందా?

ఎన్నికల్లో బీసీల మద్దతు ఎంత అవసరమో అర్ధమవటంతోనే అన్నీపార్టీలు బీసీ భజన చేస్తున్నాయి. అందుకనే వైసీపీ, టీడీపీతో పాటు తాజాగా బీజేపీ కూడా బీసీలను మంచి చేసుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉంది.

Advertisement
Update: 2022-11-26 05:17 GMT

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల మద్దతు చాలా కీలకంగా మారిపోయింది. ఇప్పటి లెక్కల ప్రకారమైతే వైసీపీ లేదా తెలుగుదేశంపార్టీకి మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశముంది. ఎన్నికల్లో బీసీల మద్దతు ఎంత అవసరమో అర్ధమవటంతోనే అన్నీపార్టీలు బీసీ భజన చేస్తున్నాయి. అందుకనే వైసీపీ, టీడీపీతో పాటు తాజాగా బీజేపీ కూడా బీసీలను మంచి చేసుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉంది.

2019 ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బీసీలకు త‌గిన ప్రాధాన్యత ఇస్తున్నారు. మంత్రివర్గంలో అవకాశాలు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌ టికెట్లు, రాజ్యసభ నామినేషన్లో కూడా బీసీలకే బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇదే సమయంలో పార్టీకి దూరమైపోయిన బీసీలను మళ్ళీ దగ్గరకు తీసుకునే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూడా గత చరిత్రను తిరగేస్తున్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే శనివారం బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌తో జగన్ ప్రత్యేకంగా సమావేశమవబోతున్నారు. పోయిన ఎన్నికల్లో బీసీలు వైసీపీకి మద్దతివ్వటం వల్లే అఖండ విజయం సాధ్య‌మైంది. అయితే ఇంకా కొన్ని సామాజిక వర్గాలు టీడీపీని అంటిపెట్టుకునే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఉన్న బీసీలను కూడా లాగేసుకోవాలన్నది జగన్ ఆలోచన. ఇందులో భాగంగానే కార్యాచరణ కోసం జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.

ఇదే సమయంలో ఆదివారం బీజేపీ కూడా ఏలూరులో బీసీ సదస్సు నిర్వహించబోతోంది. బీసీ సామాజిక వర్గాలను బీజేపీ వైపుకు ఆకర్షించటమే టార్గెట్‌గా కమలనాథులు పావులు కదుపుతున్నారు. బీజేపీనే బీసీల పార్టీ అని చెప్పుకునేందుకు నరేంద్ర మోడీ, కేంద్రమంత్రివర్గంలో బీసీల సంఖ్య లాంటి ఉదాహరణలను చెబుతోంది. సమాజంలో బీసీల జనాభా సుమారు 50 శాతం ఉండచ్చని అంచనా. దీంతో అన్నీపార్టీల్లోను బీసీల మద్దతు లేకపోతే గెలవటం కష్టమనే విషయం అర్ధమైపోయింది.

బీజేపీ వైపు బీసీలు మొగ్గు చూపుతారా లేదా అన్న విషయాన్ని వదిలేస్తే టీడీపీ మాత్రం చేతులారా బీసీలను దూరం చేసుకున్నదైతే వాస్తవం. అధికారంలో ఉన్నపుడు బీసీలను నిర్లక్ష్యం చేసిన ఫలితమే మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి. దీన్నే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటమంటారు. మరి బీసీల మద్దతు ఎవరికుంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News