‘టిఆర్ఎస్ లో చీలిక’ ఒక మిథ్య !

”టీఆర్‌ఎస్‌ లో సీఎం పదవికోసం పార్టీ చీలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. తన కొడుకు కేటీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒక నెల అయినా సీఎం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కొడుకు కనీసం మాజీ సీఎం అని అయినా అనిపించుకోవాలని అనుకుంటున్నారు.కూతురు కవిత,మేనల్లుడు హరీశ్‌రావు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.టిఆర్ఎస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి’’అని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. టిఆర్ఎస్ లో చీలిక రావాలని కేసీఆర్ ప్రత్యర్థులు చాలాకాలంగా కాంక్షిస్తున్నారు.ఇంగ్లీష్ లో దీన్ని ‘wishful thinking’ అంటారు.అయితే […]

Advertisement
Update: 2022-06-27 09:36 GMT

టీఆర్‌ఎస్‌ లో సీఎం పదవికోసం పార్టీ చీలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. తన కొడుకు కేటీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒక నెల అయినా సీఎం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కొడుకు కనీసం మాజీ సీఎం అని అయినా అనిపించుకోవాలని అనుకుంటున్నారు.కూతురు కవిత,మేనల్లుడు హరీశ్‌రావు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.టిఆర్ఎస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి’’అని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

టిఆర్ఎస్ లో చీలిక రావాలని కేసీఆర్ ప్రత్యర్థులు చాలాకాలంగా కాంక్షిస్తున్నారు.ఇంగ్లీష్ లో దీన్ని ‘wishful thinking’ అంటారు.అయితే ఈ మనోవాంఛ నెరవేరడం కష్టమే! టీఆర్ఎస్ లో చీలిక రావాలని కోరుకోవడం,చీలిపోతుందని నమ్మడం… ‘ఎండమావి’ దృశ్యాలు.

కేసీఆర్ 2014 లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి పార్టీని,ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడుపుతున్నారు.వన్ మేన్ షో అని విమర్శించినా,నియంతృత్వ పోకడలు అని ఆరోపించినా దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఇందుకు మినహాయింపు కాదు.మరో విధంగా నడపాలనుకుంటే ఏరి కోరి ‘విచ్చిన్నాన్ని’కోరుకోవడమేనని ఆయా పార్టీల సారధులకు తెలుసు.స్టాలిన్, నవీన్ పట్నాయక్,జగన్,చంద్రబాబు,మమతా బెనర్జీ తదితరులంతా తమకు పార్టీపై ‘పట్టు’ లేకపోతే పార్టీని సమర్ధంగా ఎట్లా నడపగలరు?

కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ లో ఆయన కుటుంబానికి చెందిన నలుగురు నాయకులు తమ సామర్ధ్యాన్ని రుజువుచేసుకుంటూ ఉన్నారు.మంత్రులు కేటీఆర్,హరీశ్ రావు,ఎమ్మెల్సీ కవిత,రాజ్యసభ సభ్యుడు సంతోష్ జోగినపల్లిలకు వారి పరిధులు,పరిమితులు వాళ్లకు తెలుసు.ఆ ‘రేఖ’ను దాటి ముందుకు వెళ్ళలేరు.వెళితే ఏమి జరుగుతుందో,పర్యవసానాలు ఏమిటో ఆ నలుగురికీ అంచనా ఉన్నది.అంతకు మించిన అవగాహన కూడా ఉన్నది.కనుక వారెవరూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట జవదాటరు.ఆయన ఆదేశాలను ఉల్లంఘించరు.

మంత్రి హరీష్ రావుపై 2016 నుంచే బీజేపీ వల విసురుతోంది.దాన్ని ఆయన తోసిపుచ్చినా హరీశ్ విధేయతపై అనుమానాలు కలిగే రీతిలో సోషల్ మీడియాలో కథనాలను గతంలో వండి వార్చారు.”హరీష్ రావు బీజేపీలో చేరే అంశంపై లోతుగా ఆలోచిస్తున్నారు.

బీజేపీ అగ్రనేతల నుంచీ ఆయనకు స్వాగతం లభించింది. హరీష్ రావు పార్టీ మారితే… ఆయనకు పై నుంచీ క్షేత్రస్థాయి వరకూ పట్టున్న కారణంగా… పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉంది. ఇదివరకు ఆయనకు కాంగ్రెస్ నుంచీ ఆఫర్ రాగా హరీష్ రావు తిరస్కరించారు. ఇప్పుడు హరీష్ రావు తనేంటో నిరూపించుకునేందుకు బీజేపీ ఇచ్చిన ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది” అంటూ మూడేళ్ళ కిందట ‘దక్కన్ క్రానికల్’ ఒక కథనాన్ని రచించింది.ఇదో ‘ఏప్రిల్ ఫూల్’ వార్త. ప్రేక్షకుల్ని ఏప్రిల్ ఫూల్స్ చెయ్యడానికి డీ.సీ.ఈ వార్త రాసింది.దీనిపై అప్పట్లో రగడ జరిగింది.

నిజానికి హరీశ్ రావు పార్టీ మారాలన్న ఆలోచన ఎన్నడూ చేయలేదు.అయితే ఏ పార్టీలో అయినా ‘సమఉజ్జీలు’గా ఉన్న వారి మధ్య ‘పోటీ’ సహజం.కేటీఆర్,హరీశ్ మధ్య అలాంటి పోటీయే జరుగుతున్నట్టు ప్రజలకు అనిపిస్తుంది.అందులో ఒకరు ఎక్కువ,మరొకరు తక్కువ అనే పరిస్థితి ఏమీ లేదు.గ్రూపులు లేవు.గ్రూపు రాజకీయాలు నడిపినట్టు సూచనప్రాయంగా సమాచారం అందినా ‘చండశాసనుడు’ కేసీఆర్ ప్రతిక్రియ ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు.అలాంటి ఊహే ఎవరినైనా భయకంపితులను చేస్తుంది.

రాజకీయాల్లో కొన్నేళ్ల పాటు సురక్షితంగా కొనసాగాలన్నా,రాజకీయ భవిష్యత్తుకు భద్రత ఉండాలన్నా పార్టీ అధ్యక్షుని పట్ల విధేయత ఒక్కటే మార్గం.కేసీఆర్ కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాల పట్ల కొడుకు కేటీఆర్,కూతురు కవితకు కూడా ‘అసంతృప్తి’ ఉంటే ఉండవచ్చు.కానీ వారు తమ అసంతృప్తిని బయటకు వెల్లడించే అవకాశమే లేదు.అది ఆచరణ సాధ్యమూ కాదు.

ఒక రాజకీయ పార్టీలోనే కాదు,ఒక కుటుంబంలోనూ అభిప్రాయబేధాలు చాలా సహజం.రాజకీయ కుటుంబం అయితే ఇవి ఇంకా ఎక్కువగా ఉండవచ్చు.అంత మాత్రాన కుటుంబం చీలిపోదు.రాజకీయ పార్టీ కూడా చీలిపోదు.టిఆర్ఎస్ లో కేసీఆర్ కాకుండా నలుగురు కుటుంబ సభ్యులు పలు పదవుల్లో ఉన్నా,పార్టీలో ఎవరూ ‘అధికార కేంద్రం’ గా తయారయ్యే సాహసం చేయడం లేదు.

అదే కేసీఆర్ నాయకత్వ పటిమకు నిదర్శనం.కేసీఆర్ మినహా మరొక ‘అధికార కేంద్రం’ ఏర్పడకపోవడం పార్టీకి సానుకూల అంశం.అలాంటి ‘అధికార కేంద్రాలు’ఏర్పడితే పార్టీకి జరిగే నష్టం గురించిన అవగాహన కేసీఆర్ కు పుష్కలంగా ఉన్నది.అందువల్ల టిఆర్ఎస్ లో ‘నెంబర్ టూ’ కూడా ఎవరూ లేరు.

కేటీఆర్ సైతం ఇంతవరకు తాను నెంబర్ టూ అని ఎక్కడా చెప్పలేదు.అటువంటి అభిప్రాయం వచ్చేలా కూడా ఎక్కడా ప్రవర్తించలేదు.అటువంటి వ్యాఖ్యలూ చేయకుండా ఆయన చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడుక్కి లభించే ఆదరణ,ఆకర్షణ,ప్రాధాన్యం సర్వసాధారణ సంగతి.అయితే ఆ ప్రాధాన్యాన్ని ‘దుర్వినియోగ’పరచినపుడే అసలు సమస్య.కేటీఆర్ ఎన్నడూ అలాంటి ఆలోచన చేసిన దాఖలాలు లేవు.

కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు ‘నెంబర్ టూ’ కథనాలు వెలువడ్డాయి.ఆయన పార్టీలో ‘ముఖ్య’మైన అధికారకేంద్రంగా మారుతారంటూ ప్రచారం జరిగింది.కానీ అది నిజం కాలేదు.తండ్రీ – కొడుకుల మధ్య,తండ్రీ – కూతుళ్ళ మధ్య,మామ – మేనల్లుని మధ్య, అన్న -చెల్లెళ్ళ మధ్య ‘గొడవలు’జరుగుతున్నాయని కేసీఆర్ ప్రత్యర్థులు,కాంగ్రెస్,బీజేపీ నాయకులు ప్రచారం సాగించారు.ఈ గొడవలన్నింటికీ కేసీఆర్ తోడల్లుని కుమారుడు,ఎంపీ సంతోష్ జోగినపల్లి ‘సూత్రధారి’ అని కూడా కొందరు ఆరోపించారు.సంతోష్ కుమార్ ను ‘శకుని’గా కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు తరచూ ఆరోపిస్తుంటారు.

రమ్యారావు తమ్ముడు వంశీ ముఖ్యమంత్రికి పీ.ఏ.గా కొనసాగుతుండడం మరో విశేషం.సంతోష్ కుమార్ కు టిఆర్ఎస్ లో ప్రాధాన్యం లభించడం పట్ల ‘గిట్టని’ వారు ఎంతో మంది ఉన్నారు.ఇందుకు ప్రధాన కారణం సంతోష్ కుమార్ నిరంతరం కేసీఆర్ ను అంటి పెట్టుకొని ఉండడమే!ముఖ్యమంత్రికి అనుక్షణం వెన్నంటి ఉండే వ్యక్తులపై పార్టీలోనూ,కుటుంబంలోనూ ‘అసూయ’ఏర్పడడం అసహజం కాదు.

అయితే ఎవరిని ఎక్కడ పెట్టాలో,ఎవరిని ఎక్కడ పెంచాలో,ఎవరిని ఎక్కడ తుంచాలో కేసీఆర్ కన్నా ఎక్కువగా తెలిసిన వాళ్ళు బహుశా అరుదు.కనుక ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ ‘ఇంట్లో’ భీకర పోరాటాలు జరుగుతున్నాయని చేస్తున్న ప్రచారం నిరాధారమైనది.ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు.2014,2018 లలో రెండు సార్లు కేసీఆర్ కు ప్రజామోదం లభించింది.

కాగా బీజేపీలోనే లుకలుకన్నట్టు చాలా కాలంగా ప్రచారం ఉన్నది.పార్టీ నాయకుల మధ్య విబేధాలున్నట్టు పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌,ఈటల రాజేందర్ కు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొసగడం లేదు.అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి,బండి సంజయ్ కు మధ్య ‘ఆధిపత్యపోరు’ సాగుతోంది.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయిన నాటి నుంచి ‘బండి వేగాని’కి బ్రేకులు లేవు.ఆయన దూకుడు ముందు మిగతా నాయకులు వెనుకబడిపోతున్నారు.

అయితే అదే సందర్భంలో బండిపై సొంత పార్టీలోనే ‘రుసరుసలు’న్నాయి.ఎమ్మెల్యే రఘునందన్ రావుకు,బండికి మధ్య కూడా అభిప్రాయబేధాలున్నట్టు బీజేపీ వర్గాల్లో ప్రచారం ఉన్నది.కనుక బండి సంజయ్ టిఆర్ఎస్ లో చీలికను ఆశించే ముందు సొంత పార్టీలో గ్రూపు రాజకీయాలపై దృష్టి సారిస్తే బాగుంటుంది.

Tags:    
Advertisement

Similar News