యనమల చెప్పేది భగవద్గీతా ? " మంత్రి బొత్సా

మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు సాక్షాత్తూ శ్రీ క్రిష్ణుడు అనుకుంటున్నారా? ఆయన చెప్పేదంతా భగవద్గీత అని భావిస్తున్నారా? అని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్సా సత్యనారాయణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై మాజీ మంత్రి యనమల రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి బొత్సా మండిపడ్డారు. రాష్ట్ర్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు వెలసినా వాటిని ప్రభుత్వం కూల్చివేస్తుందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎవరినీ ఉపేక్షించవద్దని ఆదేశాలు ఇచ్చారని అన్నారు. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో […]

Advertisement
Update: 2019-06-28 20:56 GMT

మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు సాక్షాత్తూ శ్రీ క్రిష్ణుడు అనుకుంటున్నారా? ఆయన చెప్పేదంతా భగవద్గీత అని భావిస్తున్నారా? అని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్సా సత్యనారాయణ మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై మాజీ మంత్రి యనమల రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి బొత్సా మండిపడ్డారు. రాష్ట్ర్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు వెలసినా వాటిని ప్రభుత్వం కూల్చివేస్తుందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎవరినీ ఉపేక్షించవద్దని ఆదేశాలు ఇచ్చారని అన్నారు.

శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి బొత్సా సత్యనారాయణ గత ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. కరకట్టపై ఉన్న లింగమనేని కట్టడాలు సక్రమమేనని చెప్పడానికి మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఎవరూ అంటూ ఆయన ప్రశ్నించారు.

“యనమల రామక్రిష్ణుడు ఇంకా మంత్రిననే అనుకుంటున్నారు. ఆదేశాలు ఇవ్వడానికి ఆయన ఎవరు?” అని మంత్రి బొత్సా విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధించే ఉద్దేశ్యం లేదని, ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోందని మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు.

” మాజీ ముఖ్యమంత్రి అయినా సామాన్యుడైనా ప్రభుత్వానికి ఒక్కటే. ఎవరి మీద ఎక్కువ ప్రేమా.. ఎవరి మీద తక్కువ ప్రేమ చూపించదు” అని మంత్రి బొత్సా అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ కనుసన్నల్లోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని, అవన్నీ లోపభూయిష్టంగానే ఉన్నాయని ఆయన ఆరోపించారు. “గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని విద్యుత్ ఒప్పందాలపైనా సమీక్షలు జరుగుతాయి” అని ఆయన అన్నారు.

కుల పత్రికల కుట్ర – విజయసాయి రెడ్డి

క్రిష్ణా నది కరకట్టపై ఉన్న కట్టడాలను చారిత్రక భవనాలుగా కొందరు చిత్రీకరిస్తున్నారని, ఆ కట్టడాలన్నీ అక్రమమేనని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి అన్నారు.

ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పత్రికల వ్యవహార శైలిపై మండిపడ్డారు. “అక్రమ కట్టడాలను కొన్ని కుల పత్రికలు చారిత్రక కట్టడాలుగా చిత్రీకరిస్తున్నాయి. వాటిని కూల్చడం అక్రమమంటూ కథనాలు రాస్తున్నాయి” అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలన్నింటిని కూల్చివేయడం ఖాయమని ఆయన ట్విట్టర్ లో స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News