మైహోంతో ఉత్తమ్‌ రహస్య ఒప్పందం

ఘోర పరాజయంతో తెలంగాణ కాంగ్రెస్‌ కుదేలైంది. ఓటమికి నేతలు అప్పుడే ఒకరిపై ఒకరు నిందలేసుకుంటున్నారు. చంద్రబాబుతో పొత్తు వల్లే భారీగా నష్టపోయామని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర నాయకత్వంపైనా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సరిగా వ్యవహరించకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం మరో అడుగు ముందుకేసి ఉత్తమ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌తో ఉత్తమ్‌ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. […]

Advertisement
Update: 2018-12-14 06:05 GMT

ఘోర పరాజయంతో తెలంగాణ కాంగ్రెస్‌ కుదేలైంది. ఓటమికి నేతలు అప్పుడే ఒకరిపై ఒకరు నిందలేసుకుంటున్నారు. చంద్రబాబుతో పొత్తు వల్లే భారీగా నష్టపోయామని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర నాయకత్వంపైనా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సరిగా వ్యవహరించకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం మరో అడుగు ముందుకేసి ఉత్తమ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌తో ఉత్తమ్‌ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.

కేసీఆర్‌తో కుదిరిన ఒప్పందం కారణంగానే అభ్యర్థులను ఆరు నెలల ముందు ప్రకటిస్తామని చెప్పిన ఉత్తమ్… ఆ తర్వాత ఆఖరి వరకు అభ్యర్థుల ప్రకటన జాప్యమయ్యేలా చేశారని గజ్జెల కాంతం విమర్శించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా… ఓడినా బాధ్యత వహిస్తానని చెప్పిన ఉత్తమ్ కుమార్‌ రెడ్డి వెంటనే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ నాయకత్వాన్ని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అంగీకరించడం లేదన్నారు.

ఉత్తమ్ కుమార్‌ రెడ్డి గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలు బయటకు రాకుండా కేసీఆర్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు సన్నిహితుడైన మైహోం రామేశ్వరరావుతో ఉత్తమ్‌ ఒప్పందం చేసుకుని… అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన చాలా ఆలస్యం అయ్యేలా చేశారన్నారు.

అయితే గజ్జెల కాంతం విమర్శలను కాంగ్రెస్ వాళ్ళు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆరునెలల ముందే అభ్యర్ధులను ఎంపిక చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా రాహుల్ గాంధీనా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయనకే టికెట్ వస్తుందో రాదో తెలియని స్థితి కాంగ్రెస్ లో ఉంటుందని, ఆలాంటి ఉత్తమ్ పార్టీ ఎప్పుడు టిక్కెట్లు ఇవ్వాలో నిర్ణయించగలడా? అని అంటున్నారు.

కాంగ్రెస్ ఘోరంగా పరాజయం చెందడానికి చంద్రబాబుతో పొత్తే కారణమని అందరూ విమర్శిస్తూ ఉంటే ఆ అభిప్రాయాన్ని పక్కదారి పట్టించడానికి ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మరికొందరి వాదన.

Advertisement

Similar News