పవన్‌ పై అందరికీ అసంతృప్తే....

చిరంజీవి కీర్తి ప్రతిష్టలే పెట్టుబడిగా హీరోగా రాణించిన పవన్‌ కళ్యాణ్‌ లక్షలాదిమంది చిరంజీవి అభిమానులకు వారసుడయ్యాడు. తనూ సొంతంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. వెండితెరపై తనదైన ముద్రవేశాడు. ఆయన అంతటితో ఆగిపోకుండా రాజకీయ రంగప్రవేశం చేశాడు. ఆయనలో ఆవేశం చూసి చాలా మంది ముచ్చటపడ్డారు. ఆయన అయోమయ రాజకీయ సిద్దాంతాలు చూసి ఆ అభిమానం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. రాజకీయాల్లో మంచి మార్పును ఆశించే పౌరులకు, మేధావులకు నిరాశే మిగిలింది. అయినా ఆయనకు విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ […]

Advertisement
Update: 2016-09-12 02:56 GMT

చిరంజీవి కీర్తి ప్రతిష్టలే పెట్టుబడిగా హీరోగా రాణించిన పవన్‌ కళ్యాణ్‌ లక్షలాదిమంది చిరంజీవి అభిమానులకు వారసుడయ్యాడు. తనూ సొంతంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. వెండితెరపై తనదైన ముద్రవేశాడు.

ఆయన అంతటితో ఆగిపోకుండా రాజకీయ రంగప్రవేశం చేశాడు. ఆయనలో ఆవేశం చూసి చాలా మంది ముచ్చటపడ్డారు. ఆయన అయోమయ రాజకీయ సిద్దాంతాలు చూసి ఆ అభిమానం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. రాజకీయాల్లో మంచి మార్పును ఆశించే పౌరులకు, మేధావులకు నిరాశే మిగిలింది. అయినా ఆయనకు విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ ఉంది. గత ఎన్నికల్లో అది టీడీపీ, బీజేపీలకు సాయపడింది. చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠంమీద కూర్చోబెట్టింది.

చంద్రబాబు ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేకపోవడం, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవడం, రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేయకపోవడం తదితర ఫేయిల్యూర్స్‌తో పాటు రాజధాని పేరుతో, ప్రాజెక్టుల పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాలు బలవంతంగా గుంజుకోవడం వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు జనం… ముఖ్యంగా ఆయన అభిమానులు… ఆయన కులస్తులు ఆశగా పవన్‌ వైపు చూశారు. ప్రశ్నిస్తానన్న పవన్‌ టీడీపీ సమకూర్చిన ప్రత్యేక విమానంలో అమరావతికి వెళ్లివచ్చి తుస్సుమనిపించాడు. మళ్లీ కొద్దిరోజులు అడ్రస్‌ లేకుండా పోయాడు. రెండు వారాల క్రితం మళ్లీ ప్రత్యక్షమై తిరుపతిలో ఒక్కరోజు వ్యవధిలో గొప్ప బహిరంగసభ నిర్వహించాడు. అంత తక్కువ సమయంలో భారీ బహిరంగ సభను నిర్వహించడం పెద్ద రాజకీయ పార్టీలకు తప్ప మిగిలినవారికి సాధ్యం కాదు. దానిని బట్టి ఈ సభ నిర్వహణ వెనుక ఎవరున్నారో తెలిసిపోయింది. ఈ సభలో పవన్‌ ప్రసంగం చిన్న చిన్న అయోమయాలతో పరవాలేదనిపించింది.

కాకినాడలో జరిగిన రెండవ సభలో ఆయన ఏం మాట్లాడాడో ప్రజలకు అర్ధం కాలేదు. ఆయనకైనా అర్ధమైందా? అనేది ప్రజల సందేహం. ఉద్యమం చేయాలంటాడు… ఉద్యమం వద్దంటాడు… నిలకడలేని అభిప్రాయాలతో ప్రజల్లో ఆయన గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోయింది. అభిమానులు అయోమయంలో పడ్డారు. కాపు కులస్తులకు ఇంతకూ పవన్‌ అభిప్రాయం ఏమిటి? అనేది అర్ధం కాలేదు.

సభ తర్వాత టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ అదే గందరగోళం. స్పష్టత లేని రాజకీయ భావాలు. ఒక నిమిషం తెలంగాణను పొగుడుతాడు. మరో నిమిషంలో విమర్శిస్తాడు. అలాగే బీజేపీని విమర్శించాడు. జగన్‌ను అయితే…. జగన్‌ ఎవరో తెలియదనట్టు, అంత ప్రాముఖ్యం లేని, పేరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలేని వ్యక్తి అన్నట్లు అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు.

మొత్తంమీద పవన్‌ వ్యవహారం అందరికీ ఇబ్బందిగానే ఉంది.

వైసీపీకి అయితే పవన్‌మీద చెప్పలేనంత కోపం. జగన్‌ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కనివ్వకుండా చేశాడని బాధ. పైగా ఇలా పంచ్‌లు ఇస్తున్నాడన్న కోపం.

బీజేపీకి అయితే మొన్నటిదాకా కొంత కృతజ్ఞత ఉండేది. ఇప్పుడు పవన్‌ చంద్రబాబు జేబులో మనిషి అన్న భావన బీజేపీ వర్గాల్లో బలపడింది. పవన్‌ ఉపన్యాసాలను “హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌” గా భావిస్తున్నారు. మిగతా పార్టీలను పవన్‌ తట్టుకోగలడు కానీ బీజేపీని, ఆర్‌ఎస్‌ఎస్‌ను తట్టుకోవడం పవన్‌ వల్ల కాదు. ఉతికి ఆరేస్తారు. బట్టలు విప్పి నిలబెడుతారు.

ఇక కాపు కులస్తులైతే ఇప్పుడిప్పుడే పవన్‌ విషయంలో గందరగోళం నుంచి బయటపడుతున్నారు. కాపులకు మద్దత్తుగా నోరు మెదపకపోవడం, చంద్రబాబు కష్టాల్లో పడ్డప్పుడల్లా రంగప్రవేశం చేసి ఆదుకోవడం చూస్తుంటే పవన్‌ ఏమిటో వాళ్లకు అర్దమవుతోంది. రాజధాని భూముల వ్యవహారంలో కాపు కులస్తులు పవన్‌మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబును ఎదిరించి తమ భూములు కాపాడతాడని విశ్వసించారు. కానీ పవన్‌ చంద్రబాబు చంకనెక్కి కూర్చోవడంతో వాళ్లల్లో ఆశలు అడుగంటాయి.

ఆయన అభిమానుల్లో ఎక్కువమంది కాపు యువకులు. వాళ్లల్లో అంతర్మధనం మొదలైంది. అంత త్వరగా ఆయనపై అభిమానాన్ని వదులుకోలేరు గానీ వాళ్ల అభిమానాన్ని సినిమాలకు పరిమితంచేసుకుని, పవన్‌ రాజకీయ నాయకుడి అవతారాన్ని అంగీకరించకపోవచ్చు.

కమ్యూనిస్టు పార్టీలు కూడా పవన్‌ రాజకీయ అవగాహనకు ఆశ్చర్యపోతున్నాయి. పవన్‌ విపరీతంగా చదువుతాడని, చెగువేరాలాంటి వారికి వీరాభిమాని అని భ్రమల్లో ఉండేవాళ్లు. కానీ ఆయనకు సీపీఐకి, సీపీఎం కు తేడా తెలియదని కమ్యూనిస్టులకు ఇప్పుడే తెలిసింది.

పవన్‌ రాజకీయ ఉపన్యాసాలవల్ల పొలిటికల్‌ పార్టీలతోపాటు చిరంజీవి కుటుంబం కూడా అసంతృప్తిగా ఉంది. పవన్‌ తెలంగాణ మీద చేసిన కామెంట్లు చూసి కేటీఆర్‌లాంటి వాళ్లు స్పందిస్తున్న తీరుచూసి చిరంజీవి కుటుంబం ఆందోళన చెందుతోంది. టీఆర్‌ఎస్‌ శ్రేణులు పవన్‌ను విమర్శిస్తూ ఆ చెప్పే నీతులేవో మీ అన్నకు చెప్పలేకపోయావా? ముందు మీ ఇంట్లో కశ్మలం కడుక్కో అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టడం, చిరంజీవి కుటుంబానికి చిరాకుగా ఉంది. అంతేకాకుండా త్వరలో చిరంజీవి సినిమా, వాళ్ల అబ్బాయి సినిమా రిలీజ్‌ కానున్నాయి. పవన్‌ వ్యాఖ్యలను తెలంగాణ వాదులు సీరియస్‌గా తీసుకుంటే ఆ ప్రభావం వీళ్ల సినిమాలమీద ఉంటుంది, కలెక్షన్లమీద ఉంటుంది. అందుకే చిరంజీవి కుటుంబం పవన్‌ మీద కొంత కోపంగా ఉన్నారు.

అందరిని పగచేసుకొని చంద్రబాబుకు దగ్గరయ్యాడు అనుకుంటే… ఇప్పుడు పవన్‌ వల్ల టీడీపీకి రాబోయే కొత్త కష్టాలు చూసి టీడీపీ వాళ్లు బయపడుతున్నారు. రాబోయే రోజుల్లో పవన్‌ వల్ల తమకు బీజేపీ నుంచి కొత్త కష్టాలు ఎదురవుతాయని బయపడుతున్నారు. పవన్‌ ఉపన్యాసాల్లో ఆంధ్రాలో తుఫానులోస్తే కేంద్రం సరిగా సాయం చేయడం లేదని విమర్శించాడు. గతంలో తుఫాను వచ్చినపుడు కేంద్రం ఇచ్చిన డబ్బుకు జమా ఖర్చులు చూపకపోతే తరువాత వచ్చిన తుఫానుకు కేంద్రం నుంచి నిధులు రావు. అందుకే తమిళనాడుకు ఒక్క పూటలో వెయ్యికోట్ల సాయం చేసిన కేంద్రం నెల్లూరు, రాయలసీమల్లో తుఫాను వల్ల నష్టం జరిగినా కేంద్రం డబ్బులు విదిల్చలేదు. ఆ పాపం చంద్రబాబు ప్రభుత్వానిది. కేంద్రానిది కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ఏడు జిల్లాలకు ఇచ్చిన వందల కోట్ల రూపాయల నిధులను అందుకు వినియోగించకుండా దుబారా ఖర్చులకు వాడుకున్నారు. ఆ నిధులకు జమా ఖర్చులు లేవు. అలాగే రాజధాని నిర్మాణంకోసం ఇచ్చిన వేల కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చుపెట్టింది ఇంత వరకు కేంద్రానికి లెక్కలు సమర్పించలేదు. అందువల్లే రావలసిన కొన్ని అదనపు నిధులు ఆగిపోయాయి.దీనికి కారణం ఎవరో ప్రజలకు తెలియదు. ఈ విషయాలు ఎల్లోమీడియాలో రావు. రాజకీయ పరిజ్ఞానం లేనందువల్ల పవన్‌కు తెలియదు. ఇప్పుడు బీజేపీ శ్రేణులు పవన్‌కు, ప్రజలకు తెలియజెబుతారు. దానివల్ల టీడీపీకి చాలా నష్టం జరుగుతుంది అని టీడీపీ నాయకులు బయపడుతున్నారు.

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News