కాశీ, శబరిమలలో తెలంగాణ వసతి గృహాలు

రాష్ట్రం నుంచి కాశీ, శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం రెండు చోట్ల రెండు వసతి గృహాలను నిర్మించేందుకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని ప్రకటించారు మంత్రి హరీష్ రావు.

Advertisement
Update: 2023-03-10 00:03 GMT

తెలంగాణ నుంచి కాశీ, శబరిమల యాత్రలకు వెళ్లే భక్తులకు నిజంగా ఇది శుభవార్త. అక్కడ సత్రాలు, రెస్ట్ రూమ్స్ దొరక్క ఇబ్బంది పడేవారి కోసం ప్రభుత్వమే వసతి గృహాలు కట్టించేందుకు సిద్ధపడింది. తాజా కేబినెట్ మీటింగ్ లో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాశీ, శబరిమలలో వసతి గృహాల నిర్మాణానికి 50కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.

రాష్ట్రం నుంచి కాశీ, శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం రెండు చోట్ల రెండు వసతి గృహాలను నిర్మించేందుకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రం నుంచి కాశీయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.


కాశీలో నిర్మించే వసతి గృహానికి రూ.25కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. మంత్రుల బృందం, చీఫ్‌ సెక్రెటరీ త్వరలో కాశీ పర్యటనకు వెళ్తారని, అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి స్థల సేకరణ చేస్తారని. ప్రభుత్వం స్థలం మంజూరు చేయలేకపోతే, ప్రైవేటు వ్యక్తుల వద్ద అయినా స్థలం కొనుగోలు చేసి రూ.25కోట్లతో అన్ని వసతులతో సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


శబరిమలలో వసతి కేంద్రం..

అయ్యప్పమాల ధరించిన భక్తులు తెలంగాణ నుంచి ప్రతి ఏటా శబరి యాత్ర చేస్తుంటారు. అయితే జన సమ్మర్దం ఎక్కువగా ఉన్న కారణంతో అక్కడ భక్తులకు సరైన వసతి సౌకర్యం ఉండదు. అయినా కూడా భక్తులు ఏమాత్రం ఇబ్బంది పడరు.


అయ్యప్ప శరణుఘోషతో పద్దెనిమిది మెట్లు ఎక్కి, స్వామిని దర్శనం చేసుకుంటారు. యాత్రలో పడే కష్టాలన్నిటినీ ఇష్టంగా స్వీకరిస్తారు. శబరి యాత్రలో భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.25కోట్లతో శబరిమలలో తెలంగాణ రాష్ట్రం తరఫున వసతి గృహం నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.


దీనికి సంబంధించి సీఎంవో అధికారి ప్రియాంక వర్గీస్‌ ముందుగా కేరళ వెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తారు. గతంలోనే కేరళ సీఎం పినరయి విజయన్ స్థలం ఇచ్చేందుకు అంగీకరించినట్టు కూడా మంత్రుల బృందం తెలిపింది. ఆ స్థలాన్ని సేకరించి, భవన నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

Tags:    
Advertisement

Similar News