నాకు ఆ రంగు ఇష్టం ఉండదు.. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో మంత్రి కేటీఆర్

రాజాసింగ్ వేసుకున్న కాషాయరంగు చొక్కాను చూసి.. మీ షర్ట్ కలర్ నా కళ్లకు గుచ్చుకుంటోందని అన్నారు. ఆ రంగు అంటే తనకు ఇష్టముండదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి సెటైర్ వేశారు.

Advertisement
Update: 2023-02-03 10:44 GMT

తెలంగాణ అసెంబ్లీలో ఇవ్వాల్టి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్ తమిళిసై మధ్యాహ్నం 12.10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి.. సమావేశాలను ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ముందు అసెంబ్లీ ఆవరణలో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో మంత్రి కేటీఆర్ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

రాజాసింగ్ వేసుకున్న కాషాయరంగు చొక్కాను చూసి.. మీ షర్ట్ కలర్ నా కళ్లకు గుచ్చుకుంటోందని అన్నారు. ఆ రంగు అంటే తనకు ఇష్టముండదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి సెటైర్ వేశారు. దానికి రాజాసింగ్.. భవిష్యత్‌లో మీరు కూడా ఈ రంగు ధరించొచ్చేమో అని సమాధానం ఇవ్వగా.. కేటీఆర్ ఆయన వైపు చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మల్లు భట్టి విక్రమార్క కూడా కేటీఆర్‌తో కాసేపు మాట్లాడారు. తనను నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని ఫిర్యాదు చేశారు. కనీసం కలెక్టర్ కూడా ఆహ్వానించడం లేదని చెప్పగా.. కేటీఆర్ నవ్వేశారు. మరో వైపు టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్లిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు కూడా కేటీఆర్‌తో మాట్లాడారు.

హుజూరాబాద్‌లో జరిగే అధికారిక కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించారు. స్థానిక శాసన సభ్యుడిగా పాల్గొనడం మీ బాధ్యత కాదా అని అడిగారు. అయితే తనకు సమాచారం అందడం లేదని దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ లోపు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చి గవర్నర్ ప్రసంగం మొదలవుతోందని కేటీఆర్‌కు చెప్పడంతో అసెంబ్లీలోని ట్రెజరీ బెంచీల వైపు వెళ్లిపోయారు.

చాన్నాళ్లకు కేటీఆర్, ఈటల సంభాషించుకోవడం అక్కడ ఉన్న ఇతర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలో ఈటల తండ్రి చనిపోయిన సమయంలో కూడా కేటీఆర్ ఆయనను ఓదార్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News