కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు మే-6కి వాయిదా

ఏప్రిల్ 22న బెయిల్ పిటిషన్లపై తీర్పుని కోర్టు రిజర్వ్ చేసింది. ఈడీ, సీబీఐ దాఖలు చేసిన రెండు కేసుల్లో ఆమెకు బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

Advertisement
Update: 2024-05-02 06:39 GMT

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈరోజు కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. మే-6కి తీర్పు వాయిదా పడింది. ఏప్రిల్-22న కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని, అరెస్ట్ నుంచి విచారణ వరకు కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని, కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని, మహిళగా ఆరోగ్యపరమైన కారణాలు పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే సీబీఐ తరపు న్యాయవాదులు మాత్రం కవితకు బెయిల్ వద్దని కోర్టుకి విన్నవించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని, సాక్ష్యాలను ప్రభావితం చేయగలరని బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఏప్రిల్-22న వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు మే-2న ప్రకటిస్తామని తెలిపింది. అయితే ఈరోజు కూడా కోర్టు తీర్పు ప్రకటించలేదు. మే-6కి బెయిల్ పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది.

ఢిల్లీ మద్యం కేసులో క‌విత‌ను ఈడీ ఈ ఏడాది మార్చి 15న అదుపులోకి తీసుకోగా, ఆ తర్వాత సీబీఐ ఏప్రిల్ 11న‌ ఆమెను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియ‌ల్ క‌స్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. దీంతో ఆమె రెండు బెయిల్ పిట‌ష‌న్లు వేశారు. ఏప్రిల్ 22న బెయిల్ పిటిషన్లపై తీర్పుని కోర్టు రిజర్వ్ చేసింది. ఈడీ, సీబీఐ దాఖలు చేసిన రెండు కేసుల్లో ఆమెకు బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు కవితకు ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధం లేదని అంటున్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

Tags:    
Advertisement

Similar News