నేను లేని సమయంలో.. నా కుమారుడిపై కుట్ర చేశారు: వనమా వెంకటేశ్వరరావు

తాను అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటుంటే.. అదే అవకాశంగా భావించి కుట్ర చేశారని వనమా వెంకటేశ్వర రావు అన్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యతును ఆగం చేశారని మండిపడ్డారు

Advertisement
Update: 2022-08-13 15:06 GMT

అనారోగ్యంతో రెండు నెలలు నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో.. తన ప్రత్యర్థులు కుట్రలు చేశారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో తనపై ఓడినపోయినవారే.. నేను త్వరలో రాజీనామా చేస్తున్నాననే ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఐదేళ్లు నేనే ఎమ్మెల్యేగా ఉంటానని.. ఆ తర్వాత కూడా టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని వనమా ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో అనుచరులు, కార్యకర్తలు ఎలాంటి అయోమయానికి గురి కావొద్దని వనమా వెల్లడించారు.

వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ ఓ కుటుంబాన్ని వేధించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మీ-సేవ నిర్వాహకుడికి తన సోదరి, తల్లితో ఉన్న ఆస్తి గొడవలు సెటిల్ చేయాలంటే భార్యను తన దగ్గరకు పంపమని చెప్పాడు. సదరు బాధితుడు ఈ విషయాన్ని స్వయంగా వీడియో రికార్డు చేసి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వనమా రాఘవను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఇటీవల వనమా రాఘవకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని, ప్రతీ శనివారం ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించింది. సాక్ష్యులను మభ్య పెట్టడం, తారుమారు చేయడం వంటి పనులకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని పేర్కొంది. ఈ ఘటన తర్వాత వనమా వెంకటేశ్వరరావు తన కొడుకునే సమర్ధించారు. కొంత మంది కావాలనే కుట్ర చేసి తన కుమారుడిని ఇరికించారని వనమా ఆరోపించారు.

తాను అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటుంటే.. అదే అవకాశంగా భావించి కుట్ర చేశారని అన్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యతును ఆగం చేశారని వనమా మండిపడ్డారు. ఒకవేళ తాను ఆరోగ్యంగా ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పుకొచ్చారు. రాజకీయ కుట్రలను కొత్తగూడెం ప్రజలు గమనిస్తున్నారని.. ఇప్పుడు రాఘవపై సింపథీ పెరిగిందని వనమా పేర్కొన్నారు. తన కుమారుడు రాఘవపై పెట్టిన కుట్ర కేసు నిలవదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News