నిజ జీవిత సమస్యలను ఐటీ పరిష్కరించాలి - కేటీఆర్

టెక్నాలజీలో మనం చాలా ముందున్నామని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన తెలుగువారు కనపడుతుంటారని, అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉంటారని, కానీ భారత దేశానికి ఆ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు కేటీఆర్.

Advertisement
Update: 2023-01-27 16:52 GMT

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా.. ఫైర్ సైడ్ చాట్ అనే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నిజ జీవితంలో ఐటీ ఎవరికి ఎలా ఉపయోగపడాలి అనే విషయంపై ఆయన ప్రసంగించారు. ఫైర్ సైడ్ చాట్ విత్ కేటీఆర్ లో విద్యార్థులతోనూ ఆయన ముచ్చటించారు. ట్రిపుల్ ఐటీకి రావడం తనకెప్పుడూ సంతోషంగా ఉంటుందని చెప్పారు.

టెక్నాలజీలో మనం ఎక్కడ..?

టెక్నాలజీలో మనం చాలా ముందున్నామని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన తెలుగువారు కనపడుతుంటారని, అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉంటారని, కానీ భారత దేశానికి ఆ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు కేటీఆర్.

యువతే మన బలం..

భారత్ లో 50 శాతం మంది ప్రజలు 27 ఏళ్ల వయసు వారని, 65శాతం మంది ప్రజల సగటు వయసు 35 సంవత్సరాలని... ఇదే మన ఇండియా బలం అని చెప్పారు మంత్రి కేటీఆర్. అయితే ఈ ప్రపంచంలో పేదలు అధికంగా ఉన్న దేశం కూడా మనదేనన్నారు. కరోనా తర్వాత ఆకలితో అలమటించేవారి సంఖ్య మరింత పెరిగిందని చెప్పారు.


ఇండియన్ సైకాలజీ అది..

భారత్ లో తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటినుంచి ఏదైనా ఉద్యోగం సాధించాలి అని చెబుతుంటారని. ప్రభుత్వ ఉద్యోగం అయితే బెటర్.. లేదా ప్రైవేటు ఉద్యోగం అయితే ఇంజినీర్, డాక్టర్, లేదా ఇతర ఉద్యోగం.. ఇలాగే తల్లిదండ్రుల ఆలోచనలు ఉంటాయని, వాటిని దాటి బయటకొచ్చి ప్రపంచాన్ని చూడాలన్నారు.

వీరన్నపల్లి ఉదాహరణ..

నిజ జీవితంలో ఐటీ సామాన్య ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనే దానిపైనే దాని విజయం ఆధారపడి ఉంటుందన్నారు కేటీఆర్. వీరన్నపల్లి అనే గ్రామంలో తాము రైతు కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు అక్కడున్న టచ్ స్క్రీన్ పై ఓ అధికారి ఆ కేంద్రం వివరాలను చెప్పడానికి ప్రయత్నించాడని. ఆయన చాలా ఇబ్బంది పడగా, అక్కడే ఉన్న ఓ రైతు చాలా సులువుగా ఆ వివరాలను టచ్ స్క్రీన్ పై వివరించాడని గుర్తు చేశాడు. నెలరోజుల ముందే అక్కడ ఆ ఏర్పాట్లు చేశారని, వాటిని రైతులు బాగా అవగాహన చేసుకున్నారని చెప్పారు. ఐటీ అంటే నిజ జీవిత సమస్యలు పరిష్కరించగలిగేదిగా ఉండాలన్నారు. రైతులకు ఆసక్తి ఉండబట్టే దాని గురించి తెలుసుకున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకుని తమ సమస్యలకు పరిష్కారాలు కనుగొంటున్నారని తెలిపారు.

అమెరికాలో వ్యవసాయ కమతాల విస్తీర్ణం చాలా ఎక్కువని, రైతులకు పెద్ద పెద్ద పరికరాలు అందుబాటులో ఉంటాయని, పురుగు మందులను డ్రోన్ల సాయంతో చల్లుతుంటారని, ఇజ్రాయెల్ లో మరో రకంగా వ్యవసాయం ఉంటుందని, భారత్ లో చిన్న కమతాలతో రైతులు కుస్తీలు పడుతుంటారని.. వ్యవసాయం అంటే ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటుందని... టెక్నాలజీతో వాటన్నిటికి వేర్వేరు పరిష్కారాలు చూపించగలగాలన్నారు మంత్రి కేటీఆర్.

జపాన్ అందరికీ ఆదర్శం..

జపాన్ లో ఎప్పుడూ భూకంపాల భయం ఉంటుందని, అక్కడ సునామీలు ఎక్కువని, అణుబాంబుల అనుభవం కూడా ఆ దేశానికి ఉందని.. ప్రకృతి ఏమాత్రం సహకరించకపోయినా ఆక్కడి ప్రజలు అద్భుతాలు సాధించారని చెప్పుకొచ్చారు కేటీఆర్. భారత్ లో అపారమైన ప్రకృతి వనరులు అందుబాటులో ఉన్నా, మానవ మేథస్సు అందుబాటులో ఉన్నా కూడా మనం ఇంకా వెనకబడి ఉండిపోయామని చెప్పారు. టెక్నాలజీతో సమస్యల పరిష్కారం కనుగొనాలని, అది జనసామాన్యంలో ఉండాలని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News