పోలవరం పంచాయితీ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ పేచీ

పోలవరం పంచాయితీ మళ్ళీ తెరమీదికి వచ్చింది. మొదటి నుంచీ పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న తెలంగాణ వరదల నేపథ్యంలో మళ్ళీ తన గళం వినిపిస్తోంది. భద్రాచలాన్ని వరదలు ముంచెత్తడానికి పోలవరమే కారణమని తెలంగాణ ఆరోపిస్తోంది.

Advertisement
Update: 2022-07-19 09:14 GMT

భద్రాచలాన్ని వరద ముంచెత్తడంతో పోలవరం ప్రాజెక్టు అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. దీనిపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉందని, దీని ఎత్తు తగ్గించాలని లోగడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరామని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెబుతుంటే.. అలాంటి ప్రమాదమేమీ లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు కొట్టి పారేస్తున్నారు. దీనిపై ఎవరేమన్నారో వాళ్ళ మాటల్లోనే..

పువ్వాడ: పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం పట్టణంలోకి భారీగా వరద నీరు వచ్చింది. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఎన్నో గ్రామాలు వరద ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. 1986 లో నిర్మించిన కరకట్ట ప్రస్తుతం అలాగే ఉంది. భవిష్యత్తులో వరదల నివారణకు సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు కేటాయించారు. హైదరాబాద్ నుంచి నిపుణులు వెళ్లి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విభజనకు ముందు భద్రాచలం ముంపు పరిధిలోని 7 మండలాలను అన్యాయంగా ఏపీకి కేటాయించారు. ఎన్డీయే సర్కార్ కూడా ఈ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది. భద్రాద్రి పరిధిలో ఏపీకి కేటాయించిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు కేటాయించేలా పార్లమెంటులో చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నాం.. గతంలో కూడా ఇదే డిమాండ్ చేశాం.. కానీ కేంద్రం పట్టించుకోలేదు.

అంబటి రాంబాబు: పోలవరంపై తెలంగాణ వాదన సరికాదు. వరదలు వచ్చినప్పుడు ఈ డిమాండ్ చేయడంలో ఔచిత్యం లేదు.. పోలవరానికి కేంద్రం అన్ని అనుమతులూ ఇచ్చింది. వివాదాలు సృష్టించడం మంచిది కాదు., పోలవరం ప్రాజెక్టులో 45.72 అడుగుల వరకు నీళ్లు నిలపవచ్చునన్న అనుమతి ఉంది. అన్ని సమస్యలపై అప్పుడే సర్వేలు జరిగాయి. మండలాలు, గ్రామాల విలీనం కేంద్రం తీసుకున్న నిర్ణయం. ఈ రోజున భద్రాచలానికి కొత్తగా వరదలు రాలేదు.. గతంలోనూ వచ్చాయి. అసలు ఎత్తు పెంచడమన్నది సమస్యే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలూ బాగుండాలి.. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ ఏ ప్రమాదం లేదు..

కాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తెలంగాణ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. విభజన చట్టం ప్రకారమే అంతా జరుగుతోందని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవని ఆయన అన్నారు. పువ్వాడ తన సంగతి తాను చూసుకోవాలని, అనవసరపు విమర్శలు మానుకోవాలని ఆయన చెప్పారు. డిజైన్ల ప్రకారమే పోలవరం ఎత్తు పెంచారని, వందేళ్ల తరువాత గోదావరికి ఇంతగా వరదలు వచ్చాయని ఆయన అన్నారు. ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.




Tags:    
Advertisement

Similar News