కిష‌న్‌రెడ్డిపై కినుక‌.. ప్ర‌చారానికి నై అంటున్న రాజాసింగ్‌

కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిష‌న్‌రెడ్డి త‌న‌కు గౌర‌వం ఇవ్వ‌ట్లేద‌ని, పార్టీ నిర్ణ‌యాలేవీ త‌న‌కు తెలియ‌నివ్వ‌డం లేద‌ని రాజాసింగ్ మండిప‌డుతున్నారు.

Advertisement
Update: 2024-04-29 06:29 GMT

రాజాసింగ్ లోథ్‌.. తెలంగాణ బీజేపీలో ముఖ్యంగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఓ బ్రాండ్‌. శ్రీ‌రామన‌వ‌మి శోభాయాత్ర‌లతో, ఇత‌ర మ‌తాల‌పై ఘాటు వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో ఉండే రాజాసింగ్ బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా ఉంటున్నారు. పాత‌బ‌స్తీలో పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీకి రాజాసింగ్ ప్ర‌వ‌ర్త‌న మింగుడు ప‌డ‌టం లేదు. మంత్రి కిష‌న్‌రెడ్డి కావాల‌నే త‌న‌ను ప‌క్క‌న‌పెడుతున్నార‌ని మంట‌లో ఉన్న రాజా.. అందుకు నిర‌స‌న‌గానే ప్ర‌చారానికి రావ‌డం లేద‌ని చెబుతున్నారు.

అమిత్ షా వ‌చ్చినా రాజాసింగ్ రాలేదు

కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్‌షా హైద‌రాబాద్‌కు వ‌చ్చినా కూడా రాజాసింగ్ ప్ర‌చారానికి రాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాదు కేంద్రం నుంచి పార్టీ పెద్ద‌లు ఎవ‌రొచ్చినా రాజాసింగ్ వారిని క‌ల‌వ‌ట్లేదు. పార్టీలో త‌న‌కు గౌర‌వం ద‌క్క‌ట్లేద‌ని, ఏ నిర్ణ‌య‌మూ చెప్ప‌ట్లేద‌ని, ముఖ్యంగా కిష‌న్‌రెడ్డి త‌న‌ను ఎద‌గ‌నివ్వ‌ట్లేద‌ని రాజాసింగ్ ఆగ్ర‌హంతో ఉన్నారు.

గెలిచినా గౌర‌వం లేద‌ని..

2018 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. అప్పుడు శాస‌న‌స‌భాప‌క్ష నేత ప‌ద‌వి దక్కింది. మ‌ధ్య‌లో ఉప ఎన్నిక‌లొచ్చి ర‌ఘునంద‌న‌రావు, ఈట‌ల రాజేంద‌ర్ గెలిచినా రాజాసింగ్‌నే ఆ ప‌దవిలో కొన‌సాగించారు. ఈసారి బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేల‌య్యారు. సీనియ‌ర్‌ను కాబ‌ట్టి శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా త‌న‌నే కొన‌సాగిస్తార‌ని రాజాసింగ్ ఆశించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు.

మ‌రోవైపు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిష‌న్‌రెడ్డి త‌న‌కు గౌర‌వం ఇవ్వ‌ట్లేద‌ని, పార్టీ నిర్ణ‌యాలేవీ త‌న‌కు తెలియ‌నివ్వ‌డం లేద‌ని రాజాసింగ్ మండిప‌డుతున్నారు. త‌న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం కూడా భాగ‌మైన హైద‌రాబాద్ లోక్‌స‌భ స్థానానికి ఎంపీ అభ్య‌ర్థిగా మాధ‌వీల‌త ఎంపిక విష‌యం కూడా టీవీల్లో చూసేవ‌ర‌కు త‌న‌కు తెలియ‌ద‌ని.. త‌న‌కు గౌర‌వం లేన‌ప్పుడు ప్ర‌చారానికి ఎందుకు రావాల‌ని బీజేపీ నాయ‌కుల‌ను ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. అందుకే గోషామ‌హ‌ల్‌లో బీజేపీ కోసం ఆయ‌న ప్ర‌చార‌మే చేయ‌ట్లేదు. ఈ వ్య‌వ‌హారం రాష్ట్రంలో నాలుగైదు సీట్లు గెల‌వాల‌న్న పార్టీ స్ఫూర్తిని దెబ్బ‌తీస్తోంద‌ని కార్య‌క‌ర్త‌లు గోల‌పెడుతున్నారు.

Advertisement

Similar News