కోచింగ్ సెంటర్లకు కూడా ప్రశ్నాపత్రాలు అందాయా?.. ఆరా తీస్తున్న సిట్

సిట్ అధికారుల దర్యాప్తులో నిందితురాలు రేణుక నుంచి కొన్ని విషయాలను రాబట్టారు. ఆమెకు కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో పరిచయాలు ఉన్నట్లు తెలిసింది.

Advertisement
Update: 2023-03-23 01:13 GMT

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుల కస్టడీ నేటితో ముగియనున్నది. దీంతో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 8 మంది గ్రూప్-1 పరీక్షలతో పాటు ఇతర పోటీ పరీక్షలు రాసినట్లు గుర్తించారు. బోర్డులో పని చేస్తున్న మొత్తం 42 మంది ఉద్యోగులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందరూ విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. వారిని అధికారులు మరింత లోతుగా విచారించే అవకాశం ఉన్నది.

సిట్ అధికారుల దర్యాప్తులో నిందితురాలు రేణుక నుంచి కొన్ని విషయాలను రాబట్టారు. ఆమెకు కొంత మంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో పరిచయాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమెకు ఏయే కోచింగ్ సెంటర్లతో సంబంధాలు ఉన్నాయనే విషయన్ని ఆరా తీశారు. రేణుక కొన్ని సెంటర్ల పేర్లు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను కూడా విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. రేణుక తన పరిచయాలతో ఇంకా ఎవరికైనా ప్రశ్నాపత్రాలు ఇచ్చిందా? కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఎవరికైనా ప్రశ్నాపత్రాలు అమ్మారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

ఇక గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఇతర పోటీ పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన వారి జాబితాను సిట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వాళ్లు అన్ని మార్కులు ఎలా సాధించారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. లీకైన ప్రశ్నాపత్రాలు ఎవరైనా కొని పరీక్షలు రాశారా అనే అనుమానాలను సిట్ అధికారులు వెలిబుచ్చుతున్నారు. గ్రూప్-1 అభ్యర్థులు ప్రశ్నాపత్రాలు కొంటే వారిని కూడా నిందితుల జాబితాలో చేర్చాలని సిట్ అధికారులు నిర్ణయించారు.

ఇక టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకర లక్ష్మిని పోలీసులు మరోసారి ప్రశ్నించాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రే ఆమెను సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. అయితే గురువారం మరోసారి ఆమెను కార్యాలయానికి రావాలని సిట్ అధికారులు సమాచారం అందించారు. ఆమె వాంగ్మూలాన్ని పరిశీలించి..తిరిగి రికార్డు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆమె సెక్షన్ పరిధిలో ఉండే కంప్యూటర్లకు సంబంధించిన డైనమిక్ ఐపీ అడ్రస్‌తో పాటు పాస్‌వర్డ్ లను డైరీలో రాసుకుందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఆ డైరీ నుంచే వాటిని దొంగిలించినట్లు నిందితుడు ప్రవీణ్ కూడా సిట్ అధికారులకు చెప్పారు.

అయితే, శంకర లక్ష్మి మాత్రం తాను ఎక్కడా ఐపీ అడ్రస్, పాస్‌వర్డ్‌లు రాయలేదని చెబుతున్నారు. ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్లకు పొంతన కుదరడం లేదు. దీంతో శంకర లక్ష్మిని మరోసారి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఏవైనా విషయాలు దాచి పెడుతోందా అని కూడా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఒక వేళ ఏదైనా సమాచారం దాస్తే.. ఆమెను కూడా నిందితుల జాబితాలో చేర్చాలని కూడా భావిస్తున్నారు. గురువారం ఇచ్చే సమాచారాన్ని బట్టి శంకర లక్ష్మి విషయంలో సిట్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది.

ఇక లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఫ్రెండ్ రమేశ్ పాత్రపై కూడా సిట్ అధికారులు దృష్టి పెట్టారు. రాజశేఖర్‌కు అతడు చాలా క్లోజ్ ఫ్రెండని ఇప్పటికే గుర్తించారు. ప్రశ్నాపత్రాల అమ్మకంలో అతడు ఏమైనా సహకరించాడా? ఎవరికైనా ప్రశ్నాపత్రాలు అమ్మాడా? అనే విషయాలు సేకరిస్తున్నారు. మరోవైపు రాజశేఖర్‌ను ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా టీఎస్‌పీఎస్సీలో నియమించింది స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా స్టేట్ టెక్నలాజికల్ సర్వీసస్‌కు చెందిన నిర్వాహకులతో మాట్లాడాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News