హైదరాబాద్‌పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్.. నడిపించే నాయకుడి కోసం అన్వేషణ!

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే జీహెచ్ఎంసీ పరిధిలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే వ్యూహాన్ని కాంగ్రెస్ కూడా అమలు చేయాలని నిర్ణయించింది.

Advertisement
Update: 2023-02-20 02:24 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడటం లేదు. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై మరింతగా ఫోకస్ చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే జీహెచ్ఎంసీ పరిధిలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే వ్యూహాన్ని కాంగ్రెస్ కూడా అమలు చేయాలని నిర్ణయించింది.

గతంలో కాంగ్రెస్ పార్టీకి నగరంలో బలమైన పట్టు ఉండేది. సికింద్రాబాద్ లోక్‌సభతో పాటు గతంలో హైదరాబాద్ స్థానాన్ని కూడా గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజిగిరి పార్లమెంటులో మాత్రమే కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉన్నది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వస్తే.. సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది. కేవలం అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాకుండా.. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన డివిజన్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే.. నగరంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగు అయినట్లే కనిపిస్తోంది.

రాష్ట్ర రాజధానిలో ఉన్న 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని ఇటీవల జరిగిన సమావేశంలో ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు వెళ్లాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు లోక్‌సభ, 24 అసెంబ్లీ సెగ్మెంట్లను పర్యవేక్షించడానికి ఒక బలమైన నాయకుడిని నియమించాలని కూడా ఠాక్రే భావిస్తున్నారు. అధిష్టానం కూడా ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు సమాచారం.

నగరంలో ఇప్పటికే హైదరాబాద్, ఖైరతాబాద్ పేరుతో డీసీసీలు ఉన్నాయి. వాటికి అధ్యక్షులను కూడా నియమించారు. సికింద్రాబాద్ డీసీసీకి ప్రెసిడెంట్‌ను కాంగ్రెస్ ప్లీనరీ తర్వాత నియమించనున్నారు. ఈ మూడు డీసీసీలను పర్యవేక్షించి, పార్టీని నడిపించే బలమైన నాయకుడి కోసం అన్వేషణ మొదలైంది. గతంలో తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 2019లో అప్పటి ఏఐసీసీ ఇంచార్జి కుంతియా బాధ్యులను నియమించారు. హైదరాబాద్‌కు షేక్ అబ్దుల్లా సోహైల్, సికింద్రాబాద్‌కు ఎం. కోదండరెడ్డిని నియమించారు.

అయితే ఇప్పుడు నగరంలోని పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక బలమైన నేతను నియమించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని ఈ పదవి కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయన అయితే అన్ని వర్గాల నాయకులను కలుపుకొని పోగలరని.. అలాగే కాస్త దూకుడుగా కూడా వ్యవహరిస్తారని పార్టీ భావిస్తున్నది. మరోవైపు మాజీ ఎంపీ, క్రికెటర్ అజారుద్దీన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో ఒకరిని రాయ్‌పూర్‌లో జరిగే ప్లీనరీ తర్వాత బాధ్యులుగా నియమిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక పీసీసీ కమిటీలను ఎక్స్‌టెండ్ చేయాలని గతంలో కొంత మంది కోరారు. కానీ ఠాక్రే మాత్రం వారి రిక్వెస్ట్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News