తెలంగాణ కోసం సంప్రదాయాన్ని పక్కన పెట్టనున్న బీజేపీ

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఒకటి కంటే ఎక్కువ టికెట్లు ఇవ్వడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సొంత పార్టీ వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి టికెట్లిచ్చి ఓడిపోవడం కంటే.. గెలుపు గుర్రాలు ఇతర పార్టీ వాళ్లైనా.. ఒకే కుటుంబానికి చెందిన వారైనా ఓకే అని పార్టీ అంటోంది.

Advertisement
Update: 2022-07-31 06:34 GMT

బీజేపీ అధిష్టానం దృష్టంతా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై పడింది. ముఖ్యంగా తెలంగాణలో ఎలాగైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటి నుంచి భారీ ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తుంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల మాదిరిగా కాకుండా.. తెలంగాణను కొంచెం ప్రత్యేకంగా ట్రీట్ చేస్తోంది. గతంలో తమ చేతికి అందని గోవాను ఎలా కైవసం చేసుకున్నదో.. అదే మోడల్‌ను తెలంగాణలో అమలు చేసేందుకు బీజేపీ అధినాయకత్వం రెడీ అయ్యింది.

తెలంగాణలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు దొరకడం లేదు. దీంతో ఇతర పార్టీల నుంచి ప్రజాభిమానం ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే చాలా మంది నాయకులు తమ కుటుంబంలోని ఇతరులకు కూడా టికెట్లు కావాలని, అలా మాటిస్తేనే పార్టీలో చేరతామని కండిషన్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీలో ఒక సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. బీజేపీలో మొదటి నుంచి పని చేసిన వ్యక్తులు, ఆర్ఎస్ఎస్‌తో సంబంధం ఉంటేనే టికెట్ లభిస్తుంది. అంతే కాకుండా కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ కేటాయిస్తుంది. ఎంతటి గెలుపు గుర్రాలైనా కుటుంబం నుంచి మరొకరికి టికెట్ కేటాయించే పద్దతి ఉండదు. ఇది బీజేపీ రాజ్యాంగంలో రాసుకోని సిద్దాంతం. అయితే గోవాలో మాత్రం ఈ నిబంధనలను కాస్త సడలించి విజయవంతం అయ్యింది. దీంతో గోవా మోడల్‌ను తెలంగాణలో అమలు చేయాలని భావిస్తోంది.

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఒకటి కంటే ఎక్కువ టికెట్లు ఇవ్వడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సొంత పార్టీ వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి టికెట్లిచ్చి ఓడిపోవడం కంటే.. గెలుపు గుర్రాలు ఇతర పార్టీ వాళ్లైనా.. ఒకే కుటుంబానికి చెందిన వారైనా ఓకే అని పార్టీ అంటోంది. ఇలాంటి వారికి రెడ్ కార్పెట్ పరిచేందుకు జాతీయ నాయకత్వం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

గతంలోనే కొంత మంది బీజేపీలోకి వస్తామని, అయితే తమ కుటుంబంలో మరొకరికి కూడా టికెట్ కావాలని షరతు పెట్టారు. అయితే రాష్ట్ర నాయకత్వం అలాంటి సిద్దాంతం బీజేపీలో లేదని.. రెండో టికెట్ ఇవ్వమ‌ని వారిని పార్టీలోకి చేర్చుకోలేదు. తీరా చూస్తే ఇప్పుడు పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు. దీంతో సంప్రదాయాలను పక్కన పెట్టి గెలిచే వారికి టికెట్లు అనే పద్దతిని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి తెలంగాణలో ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ టికెట్లు బీజేపీ నుంచి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి గోవా మోడల్ తెలంగాణలో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News