మునుగోడులో ప్రజలపై కోమటిరెడ్డి అనుచరుల‌ దాడి

మునుగోడు నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో నిన్న రాత్రి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అనుచరులు ప్రజలపై దాడులకు దిగారు. ఆయనను నిలదీసినందుకు మూడు గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు, ప్రజలపై కర్రలు, రాళ్ళ తో దాడి చేశారు.

Advertisement
Update: 2022-11-01 06:44 GMT

మునుగోడు నియోజక వర్గంలో నిన్న రాత్రి బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు, ప్రశ్నించిన పాపానికి ప్ర‌జలపై దాడులకు తెగబడ్డారు. చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామ పరిధి రెడ్డిబావి , ఆరెగూడెం, అంకిరెడ్డి గూడెం గ్రామాల్లో ప్రచారం సమయం మించిపోయాక ప్రచారం చేస్తుండగా నిలదీసిన ప్రజలపై బీజేపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ కార్యక్రమాన్ని రిపోర్ట్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై కూడా దాడికి తెగబడ్డారు.

చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామ పరిధి రెడ్డిబావి గ్రామానికి ప్రచార సమయం తర్వాత ఎన్నికల ప్రచారం కోసం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులతో కలిసి వచ్చారు. ప్రజలు ఆయనను నిలదీశారు. గత ఎన్నికల్లో గెలిచి ఇప్పటి వరకు మళ్ళీ తమ గ్రామానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన అనుచరులు వాహనాల్లో ఉన్న కర్రలు, రాళ్ళతో గ్రామస్తులపై, అక్కడే ఉన్న జర్నలిస్టులపై దాడులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు మహిళల తలలకు గాయాలయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల దాడితో గ్రామం మొత్తం తిరగబడింది. ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తంచేయడంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. రాజగోపాల్ రెడ్డి తన ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి గ్రామం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది.

చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెం గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ గ్రామంలో కూడా రాజగోపాల్ రెడ్డిని ప్రజలు నిలదీశారు. దాంతో ఇక్కడ కూడా ఆయన అనుచరులు ప్రజలపై దాడులు చేశారు.

అంకిరెడ్డి గూడెంలో కూడా ప్రచార సమయం ముగిసి పోయాక ప్రచారానికి వచ్చారు రాజగోపాల్‌ రెడ్డి. ఆయన ప్రసంగం ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తుండగా ప్రచార సమయం ముగిశాక ప్రచారం ఎలా చేయనిస్తారని పోలీసులను ప్రశ్నించారు టీఆరెస్ కార్యకర్తలు. దీంతో రెచ్చిపోయిన రాజగోపాల్ రెడ్డి అనుచరులు టీఆర్‌ఎస్‌ కార్యాలయంలోకి దూసుకెళ్ళి కార్యకర్తలపై దాడికి దిగారు.

బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రజలపై, టీఆరెస్ కార్యకర్తలపై దాడులకు దిగడాన్ని టీఆరెస్ ఖండించింది. గ్రామస్థులపై, వార్తను కవర్‌చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుపైనా దాడి చేయడం దారుణమని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఓటువేసిన పాపానికి ప్రజలపైనే గూండాగిరీ చేసిన బీజేపీ అభ్యర్థికి గుణపాఠం తప్పదన్నారు.

Tags:    
Advertisement

Similar News