ఈ గవర్నర్ మాకొద్దు, రీకాల్ చేయండి, రాష్ట్రపతికి స్టాలిన్ మెమొరాండం

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని, అది దేశద్రోహంగా పరిగణించ వచ్చని అన్నారు స్టాలిన్.

Advertisement
Update: 2022-11-09 06:24 GMT

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు పెద్ద సమస్యగా మారిపోయారు. ఇటీవల తెలంగాణలో కూడా బిల్లుల‌ను పెండింగ్‌లో పెట్టి ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నారు గవర్నర్ తమిళిసై. పొలిటికల్ కామెంట్లు చేస్తూ, ప్రైవేటు దర్బార్ లు నిర్వహిస్తూ పాలనలోనూ జోక్యం చేసుకుంటున్నారామె. ఇక తమిళనాడు విషయానికొస్తే ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మరీ శృతిమించారని ఆరోపిస్తోంది అధికార డీఎంకే పార్టీ. వెంటనే గవర్నర్ ని రీకాల్ చేయాలని రాష్ట్రపతికి మెమొరాండం పంపించింది.

20 బిల్లులు పెండింగ్ లో..

తమిళనాడులో 20 బిల్లుల్ని గవర్నర్ ఆమోదించకుండా తొక్కిపెట్టారు. కేబినెట్ బిల్లుని ఒకసారి మాత్రమే తిప్పి పంపించే అధికారం గవర్నర్ కి ఉంది. రెండోసారి పంపితే కచ్చితంగా ఆమోదించాలి. కానీ ఇక్కడ గవర్నర్ రెండోసారి పంపించిన బిల్లుల్ని కూడా ఆమోదించలేదు. అలాగని తిరస్కరించే అవకాశం లేకపోవడంతో వాటిని మురగపెడుతున్నారు. గవర్నర్ తీరుతో విసిగిపోయిన సీఎం స్టాలిన్ ఇప్పుడు నేరుగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆయన్ను వెంటనే తొలగించాలన్నారు. రాష్ట్రపతి విశిష్ట అధికారాలతో గవర్నర్లను తొలగించ వచ్చని, ఆర్ఎన్ రవి తమ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని, ఆయన్ను ఇక ఎంతమాత్రం సహించలేమని తేల్చి చెప్పారు.

కుట్ర అంతా బీజేపీదే..

బీజేపీ చేతుల్లో కీలుబొమ్మల్లా గవర్నర్లు ఆడుతున్నారని, ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు గవర్నర్ వ్యవస్థను వాడుకుంటున్నారని మండిపడ్డారు స్టాలిన్. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని, అది దేశద్రోహంగా పరిగణించ వచ్చని అన్నారు. ఆర్‌ఎన్‌ రవి రాజ్యాంగ పదవికి అనర్హుడని రాష్ట్రపతికి సమర్పించిన మెమొరాండంలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు మద్దతివ్వాలని, వివిధ పార్టీల ఎంపీలకు కూడా డీఎంకే లేఖలు రాసింది.

Tags:    
Advertisement

Similar News