ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్ కాన్వాయ్‌పై కాల్పులు

కరణ్ భూషణ్ కాన్వాయ్‌పై కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదు కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement
Update: 2024-05-04 12:11 GMT

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కైసర్ గంజ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్ కాన్వాయ్ పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఎంపీ బ్రిజ్ భూషణ్ చిన్న కుమారుడు అయిన కరణ్ భూషణ్ కు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడంతో నిన్న బ్రిజ్ భూషణ్ కుమారుడితో కలిసి వందలాది కార్లు, వేలాది మంది జనంతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం కరణ్ భూషణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించగా పలు ప్రాంతాల్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది.

కరణ్ కాన్వాయ్ తారాబా గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం బెల్సర్ మార్కెట్ వద్ద వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి బుల్లెట్ల శబ్దం వినిపించింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కరణ్ భూషణ్ కాన్వాయ్ లక్ష్యంగా కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు అలర్ట్ అయ్యేలోగా దుండగులు తప్పించుకుని పారిపోయారు.

కాగా, కరణ్ భూషణ్ కాన్వాయ్‌పై కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదు కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కరణ్ భూషణ్ కాన్వాయ్ పై కాల్పులు జరపడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఎంపీ బ్రిజ్ భూషణ్ జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఉన్న సమయంలో పలువురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని, ఆయన్ని పదవి నుంచి తొలగించాలని మహిళా రెజ్లర్లు నెలల తరబడి ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కైసర్ గంజ్ ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్ కు బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన చిన్న కుమారుడు కరణ్ భూషణ్ కు ఆ స్థానంలో టికెట్ కేటాయించింది. బ్రిజ్ భూషణ్ కుటుంబానికే బీజేపీ మళ్లీ ఎంపీ టికెట్ ఇవ్వడంపై మహిళా రెజ్లర్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 

Tags:    
Advertisement

Similar News