ఉదయనిధికి స్టాలిన్ సమర్థన.. మోడీకి స్ట్రాంగ్‌ కౌంటర్‌

చంద్రయాన్‌ లాంటి ప్రయోగాలు చేస్తున్న దేశంలో.. కొంతమంది ఇప్పటికీ కులం ఆధారిత వివక్ష చూపిస్తున్నారని, ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తున్నారని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Update: 2023-09-07 10:40 GMT

సనాతన ధర్మం విషయంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఆయన తండ్రి, తమిళనాడు సీఎం స్టాలిన్ సమర్థించారు. సనాతన ధర్మం బోధించే అమానవీయ సూత్రాలు, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, మహిళల పట్ల చూపే వివక్ష గురించే ఉదయనిధి మాట్లాడారని సీఎం స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. ఏ మతాన్ని లేదా మత విశ్వాసాలను కించపరిచే ఉద్దేశం ఉదయనిధి వ్యాఖ్యల్లో కనిపించలేదన్నారు. ఈ మేరకు తమిళంతో పాటు ఇంగ్లిష్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు స్టాలిన్‌.


Full View

చంద్రయాన్‌ లాంటి ప్రయోగాలు చేస్తున్న దేశంలో.. కొంతమంది ఇప్పటికీ కులం ఆధారిత వివక్ష చూపిస్తున్నారని, ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తున్నారని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. అణచివేత సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బీజేపీ అనుకూల శక్తులు ఉదయనిధిని సహించలేకపోతున్నాయన్నారు. ఆయన మాటలను తప్పుగా ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ పెంచి పోషిస్తున్న ఓ వర్గం సోషల్ మీడియా గ్రూపు.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

మహిళలపై అణచివేతను కొనసాగించడానికి కొందరు సనాతన్‌ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారని.. ఉదయనిధి అలాంటి అణచివేత సిద్ధాంతాలను మాత్రమే వ్యతిరేకించాడని స్టాలిన్‌ చెప్పుకొచ్చారు. బీజేపీ ట్రోల్ ఆర్మీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆరోపించిన స్టాలిన్.. కేంద్రమంత్రులు, అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్ వంటి నేత‌లపై మండిపడ్డారు. తన కొడుకు మారణహోమానికి పిలుపివ్వలేదని, కేవలం వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాడన్నారు. కానీ, బాధ్యతగల పదవుల్లో ఉన్న ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అబద్ధాలను ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.

Tags:    
Advertisement

Similar News