పళనికే అన్నాడీఎంకే పగ్గాలు.. సుప్రీం క్లారిటీ

పన్నీర్ సెల్వం సుప్రీంకోర్టు మెట్లెక్కారు. కానీ అక్కడా పన్నీర్ కు చుక్కెదురైంది. కేవియట్ పిటిషన్ పై ఈరోజు నిర్ణయం తీసుకుంది సుప్రీం. అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామి కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది.

Advertisement
Update: 2023-02-23 09:19 GMT

జయలలిత మహాభినిష్క్రమణం తర్వాత అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుకుంది. పార్టీపై పెత్తనం కోసం పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒకరికి తెలియకుండా మరొకరు గోతులు తీసుకున్నారు. కానీ చివరకు పళని స్వామికే పెత్తనం అప్పగించే విషయంలో మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకేపై అధిపత్యాన్ని నిలుపుకోవడానికి పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

సుప్రీంకోర్టు నిర్ణయంతో పళనిస్వామి వర్గం సంబరాల్లో మునిగిపోయింది. గతేడాది జులై 11న అన్నాడీఎంకే జనరల్‌ కమిటీ సమావేశంలో మాజీ సీఎం పళనిస్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక చెల్లదంటూ మరో మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం, జనరల్‌ కమిటీ సభ్యుడు వైరిముత్తు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఫుల్ బెంచ్ ముందుకెళ్లారు పళని స్వామి. ఈ కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సింగిల్ జడ్డి తీర్పుపై స్టే విధిస్తూ పళని స్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై పన్నీర్ సెల్వం సుప్రీంకోర్టు మెట్లెక్కారు. కానీ అక్కడా పన్నీర్ కు చుక్కెదురైంది. కేవియట్ పిటిషన్ పై ఈరోజు నిర్ణయం తీసుకుంది సుప్రీం. అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామి కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది.

జయలలిత మరణం తర్వాత పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి రద్దు చేసి పన్నీర్‌ సెల్వం, పళనిస్వామి.. ఇద్దరూ సంయుక్త సమన్వయకర్తలుగా కొనసాగారు. అయితే పార్టీపై పూర్తి పెత్తనం కోసం పళని పావుల కదిపారు. 2022 జూన్‌ 23న పార్టీ సర్వసభ్య సమావేశం కొట్లాటలతో ముగిసింది. ఆ తర్వాత జులై 11న మరోసారి సమావేశం నిర్వహించారు. పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. కొత్తగా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ పదవిని తీసుకొచ్చారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీపై మరింత పట్టు పెంచుకోబోతున్న పళని స్వామి.. త్వరలో పూర్తి స్థాయి అధినేతగా మారబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News