దేశంలో వివాహిత స్త్రీల ఆత్మహత్యలే ఎక్కువ... రోజుకు 63 మంది ఆత్మహత్య!

భారత దేశంలో గృహిణుల ఆత్మహత్యలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం, 2021లో 45,026 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకొని మరణించగా అందులో గృహిణులే 23,178 మంది ఉన్నారు.

Advertisement
Update: 2022-09-10 06:26 GMT

ప్రపంచవ్యాప్తంగా, పెళ్లికాని వారితో పోల్చుకుంటే వివాహితలు ఆత్మహత్య చేసుకునే శాతం తక్కువ అని రికార్డులు చెప్తున్నాయి. అయితే భారత దేశంలో పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్దంగా ఉంది. ఈ దేశంలో పెళ్ళైన మహిళలే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఈ నెల ప్రారంభంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం, 2021లో భారతదేశంలో 45,026 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకొని మరణించారు. అంటే దాదాపు ప్రతి 9 నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.

వారిలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది వివాహిత స్త్రీలే ఉన్నారు. అందులోనూ వారిలో సగానికి పైగా - 23,178 మంది గృహిణులున్నారు.

భారతదేశంలో 2021లో సగటున రోజుకు 63 మంది గృహిణులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ అంశంపై స్పీక్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకులు డాక్టర్ నందిని మాట్లాడుతూ... " భారతీయ మహిళలకు సంబంధించినంతవరకు వివాహం ఒక రక్షణ అంశం కాదని మనకు అర్దం అవుతుంది," అన్నారామె

దేశంలో గృహిణులపై విపరీతమైన ఒత్తిడులుంటాయని, కుటుంబ సమస్యలు, వివక్ష, నిరాశ, ఆర్థిక ఒత్తిడి, ఒంటరితనం, లింగ నిబంధనలను విధించడం, తక్కువ ఆర్థిక అవకాశాలు వీరిలో ఆత్మహత్యలకు ప్రధాన‌ కారకాలుగా ఉన్నాయి అని ఆమె తెలిపారు.

చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళకు కూడా ఈ ఒత్తిడులు తక్కువ ఉంటాయనడానికి వీలు లేదు.

"ఉదాహరణకు కేరళ వంటి అధిక అక్షరాస్యత, అధిక ఆదాయ రాష్ట్రాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడులో కూడా ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి" అని పూణేలోని సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్, లా & పాలసీ డైరెక్టర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ సౌమిత్ర పఠారే చెప్పారు.

"దారుణమైన‌ విషయం ఏమిటంటే, ఆ రాష్ట్రాల్లో స్త్రీలకు, పితృస్వామ్యం, గృహహింస వంటి అంశాలు మరింత ఎక్కువ సమస్యలు సృష్టిస్తాయి." అని అన్నారు సౌమిత్ర పఠారే

"అక్కడ స్త్రీలు ఒకవైపు బయటకు వెళ్లి పని చేస్తుంటారు.వాళ్ళు సంపాదిస్తున్నందున వాళ్ళకు కొంత ఆర్థిక స్వేచ్ఛ ఉంది. కానీ వారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలలో మహిళలు ఎదుర్కొనే సమస్యలనే వాళ్ళు ఎదుర్కొంటున్నారు. " అని చెప్పారు పఠారే

ఇలా గృహిణులు ఆత్మహత్యలకు పాల్పడటానికి కుటుంబ వత్తిడి, ఆర్థిక కష్టాలు మాతమే కాక భర్త నుండి సరైన ప్రేమాభిమానాలు లేక నిర్ల‌క్ష్యానికి గుర‌వడం, భర్త చెడు అలవాట్లకు భానిస అవడం, వివాహేతర సంబంధాలు, అదనపు కట్నం కోసం వేధింపులు...ఇలా అనేక కారణాలున్నాయి. వీటన్నింటికీ అసలు కారణం దేశంలో తరతరాలుగా కొనసాగుతున్న లింగ వివక్షే.

Tags:    
Advertisement

Similar News