పండిట్ల హత్యలకు మోదీ బాధ్యత వహించాలి - అసదుద్దీన్

పండిట్లు కాశ్మీర్ నుంచి తిరిగి వలసబాట పట్టారు. దీనంతటికీ కారణం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమేననే విమర్శలు వినపడుతున్నాయి.

Advertisement
Update: 2022-08-16 13:42 GMT

కాశ్మీర్ లో పండిట్లను టార్గెట్ చేస్తూ జరుగుతున్న మారణహోమాలు ఆగడంలేదు. తాజాగా ఉగ్రవాదులు సునీల్ కుమార్ భట్ అనే పండిట్ ను కాల్చి చంపారు. ఈ ఘటన షోఫియాన్ జిల్లా చోటీపురా ప్రాంతంలో జరిగింది. సునీల్ కుమార్ భట్, అతని సోదరుడు పింటూ కుమార్ భట్ పై టెర్రరిస్టులు కాల్పులు జరపగా, సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు, పింటూకి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి.

2019లో జమ్మూకాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కాశ్మీరీ పండిట్లకు పలు ప్రయోజనాలు కల్పించి, అక్కడ ఉద్యోగావకాశాలు కల్పించింది కేంద్రం. అయితే వారి రక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో పదే పదే వారు ఉగ్రవాదులకు టార్గెట్ అవుతున్నారు. వలస కూలీలను, ఉద్యోగులను ఉగ్రమూక హతమారుస్తోంది. ఈ ఏడాది మే నెలలో బుద్గామ్ లో రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ ను ఉగ్రవాదులు ప్రభుత్వ కార్యాలయంలోనే హతమార్చారు. ఆ తర్వాత మరో మహిళా ఉపాధ్యాయురాలిని కాల్చిచంపారు. ప్రముఖ కాశ్మీరీ టీవీ నటి అమ్రీన్ భట్ ను కూడా టెర్రరిస్టులు కాల్చి చంపారు. పండిట్లు కాశ్మీర్ నుంచి తిరిగి వలసబాట పట్టారు. దీనంతటికీ కారణం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమేననే విమర్శలు వినపడుతున్నాయి.

కాశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షానే కారణం అని ఆరోపించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాపై ఆయన విరుచుకుపడ్డారు. కాశ్మీర్ పండిట్ల హత్యలు నరేంద్రమోదీ ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణ అని అన్నారు. కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలమైందని.. ఇప్పుడు కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ లోయను వదిలి వెళ్లాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశారు కానీ, కాశ్మీరీ పండిట్లకు కేంద్రం సహయం చేయలేదని, తరచూ దాడులు జరుగుతున్నా కూడా భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. పండిట్ల హత్యలకు బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అసదుద్దీన్ ఒవైసీ.

Tags:    
Advertisement

Similar News