పాకిస్తాన్ పేరు చెప్పనిదే మోదీకి ఓట్లు పడవా..?

పాకిస్తాన్ కి రాహుల్ గాంధీకి ముడిపెట్టేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు మోదీ. కాంగ్రెస్ యువరాజుకోసం పాక్ నేతలు ప్రార్థనలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Update: 2024-05-02 09:10 GMT

ఎన్నికలొస్తున్నాయంటే చాలు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి బీజేపీ రెడీగా ఉంటుంది. ఈసారి కూడా అయోధ్య రామమందిరం పేరు చెప్పి వీలైనంత మేర మైలేజీ పొందాలని చూస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి హిందూ ఓట్లన్నీ ఓవైపు తేవాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకు పంచిపెడతారని కూడా నిందలేస్తోంది. తాజాగా ప్రధాని మోదీ మరో అడుగు ముందుకేశారు. పాకిస్తాన్ కి రాహుల్ గాంధీకి ముడిపెట్టేలా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ యువరాజుకోసం పాక్ నేతలు ప్రార్థనలు చేస్తున్నారని ఆరోపించారు మోదీ.

పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్.. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, రాహుల్ ఆన్ ఫైర్ అంటూ కామెంట్ పెట్టడంతో బీజేపీ రచ్చ మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో పోటీ చేయాలని అనుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు బీజపీ నేతలు. తాజాగా మోదీ కూడా ఈ కామెంట్లపై స్పందించారు. రాహుల్ భారత ప్రధాని కావాలని పాకిస్తాన్ కోరుకుంటోందని ఆరోపించారు మోదీ. పాక్ మంత్రి వ్యాఖ్యలతో వారి మధ్య బంధం తేటతెల్లమైందని చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌ రోజురోజుకీ బలహీనపడుతోందని, ఇక్కడ ఆ పార్టీ అస్థిత్వాన్ని కోల్పోతుంటే.. అక్కడ పాకిస్థాన్‌ కన్నీళ్లు పెట్టుకుంటోందని అన్నారు మోదీ. కాంగ్రెస్‌ యువరాజును భారత ప్రధానిని చేయాలని దాయాది తహతహలాడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కు అభిమాని అనే విషయం అందరికీ తెలుసన్నారు మోదీ.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ లో బలహీన ప్రభుత్వం ఏర్పడితే గతంలో లాగా భారత్ పై దాడులు చేయడానికి ఆ దేశం సిద్ధమవుతుందని, అందుకే వారు రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఆరోపించారు మోదీ. ఎన్నికల వేళ బీజేపీకి ఇలాంటి ట్రిక్స్ అలవాటేనంటున్నారు కాంగ్రెస్ నేతలు. పాకిస్తాన్ ని తిడితే భారత్ లో ఓట్లు పడతాయని మోదీ అనుకుంటున్నారని, ఇంకెంతకాలం ఇలాంటి విద్వేష రాజకీయాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News